138 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా 

30 Jun, 2019 03:17 IST|Sakshi
కేటీఆర్‌ చేతుల మీదుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని తీసుకుంటున్న సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా  

రాష్ట్రంలో 60 లక్షల టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు 

క్రియాశీల సభ్యులకు గుర్తింపు కార్డులు 

సర్కార్‌ చేసింది అప్పు కాదు..భవిష్యత్తుకు పెట్టుబడి 

సిరిసిల్లలో మోడల్‌ గ్రంథాలయం ప్రారంభం

సిరిసిల్ల: రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగురుతోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఆయన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 32 జెడ్పీలను టీఆర్‌ఎస్‌ దక్కించుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్‌ వివరించారు. 2018 శాసససభ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 75 శాతం మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారని, లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు అందించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ నిలిచిందని కేటీఆర్‌ చెప్పారు.  

జూలై నుంచి రెట్టింపు పింఛన్లు 
జూలై నుంచి ఆసరా పింఛన్లు రెట్టింపు చేసి చెల్లిస్తామని కేటీఆర్‌ తెలిపారు. పింఛన్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోందని కొందరు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పింఛన్లకు ఢిల్లీ నుంచి వచ్చేది సున్నా అని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి అప్పులు కాదు.. భవిష్యత్తుకు పెట్టుబడి అని వివరించారు. రాష్ట్రంలో జూలై 20వ తేదీ నాటికి 60 లక్షల టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు చేర్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇందులో 35 శాతం క్రియాశీల సభ్యత్వాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతీ సభ్యత్వాన్ని కంప్యూటరీకరణ చేస్తామన్నారు. ప్రతి కార్యకర్త ఆధార్‌ నంబరు, ఫోన్‌ నంబరుతో సహా సమగ్ర సమాచారాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో రికార్డు చేస్తున్నామని చెప్పారు. క్రియాశీల కార్యకర్తలకు పార్టీ పరంగా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని, ఇళ్లలో కూర్చుని బోగస్‌ సభ్యత్వాలు నమోదు చేయొద్దని సూచించారు. కార్యకర్తలకు రూ.2 లక్షల ప్రమాద బీమా కోసం ఏటా రూ.15 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నామని వివరించారు. 

కేటీఆర్‌ విరాళం
సిరిసిల్లలో టీఆర్‌ఎస్‌ భవన నిర్మాణం కోసం తన వంతుగా నెల జీతం రూ.2.50 లక్షలు విరాళంగా అందిస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. వేదికపై ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని రూ.40 లక్షల మేర భవనానికి విరాళాలు అందించారు. దసరా నాటికి అద్భుతమైన టీఆర్‌ఎస్‌ భవనం సిద్ధం చేస్తామన్నారు.    

సిరిసిల్లలో మోడల్‌ డిజిటల్‌ లైబ్రరీ ప్రారంభం 
జిల్లా కేంద్రంలో డాక్టర్‌ సి.నారాయణరెడ్డి స్మారకమందిరం పేరుతో మోడల్‌ డిజిటల్‌ లైబ్రరీని కేటీఆర్‌ ప్రారంభించారు. రూ.3.60 కోట్లతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిరిసిల్లలో మోడల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. పిల్లలకు పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గిపోతున్న ఈ రోజుల్లో తెలుగు భాషావృద్ధికి దోహదపడేలా ఆధునిక హంగులతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. డిజిటల్‌ నెట్‌వర్క్‌తో కంప్యూటర్లను ఏర్పాటు చేసినట్లు కేటీఆర్‌ తెలిపారు. గొప్ప సమాచార, విజ్ఞాన కేంద్రంతో గ్రంథాలయం ఉంటుందన్నారు. 

మరిన్ని వార్తలు