‘చేతు’లెత్తేస్తోంది..!

2 May, 2019 10:36 IST|Sakshi

ఒకప్పుడు తిరుగులేని పార్టీగా జిల్లాను శాసించిన కాంగ్రెస్‌ పరిస్థితి ప్రస్తుతం తారుమారైంది. వరుస ఓటములతో ఆ పార్టీ తీరు ‘హస్త’వ్యస్తంగా మారింది. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులకు కనీస పోటీ ఇచ్చే స్థాయిలో లేకుండా పోయింది. అధికార పార్టీ ప్రభ ముందు కాంగ్రెస్‌ డీలా పడడం, ఎన్నికలకు ముందే చేతులెత్తేస్తుండడం ఆ పార్టీ కార్యకర్తలను కలవరానికి గురి చేస్తోంది. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ చేతులెత్తేస్తోంది.. కనీస పోటీ ఇవ్వలేని స్థితిలో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ప్రాదేశిక ఎన్నికల్లో వెనుకబడినట్లు కనిపిస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌కు నువ్వా నేనా అన్నట్లుగా గట్టి పోటీని ఇవ్వాల్సిన హస్తం పార్టీ ఏకంగా అస్త్ర సన్యాసం చేయడం చర్చనీయాంశంగా మారింది. మాక్లూర్‌ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కావడమే ఇందుకు నిదర్శనం. ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున జెడ్పీ చైర్మన్‌ రేసులో ఉన్న అభ్యర్థిని బరిలోకి దించింది. ఇలాంటి స్థానాలపై కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా బలమైన అభ్యర్థులను దించాల్సి ఉంటుంది. గట్టి పోటీని ఇచ్చే అభ్యర్థిని బరిలోకి దించి ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించే విధంగా పావులు కదపాల్సిన కాంగ్రెస్‌ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ ఉపసంహరించుకుని పోటీ నుంచి తప్పుకోవడం కాంగ్రెస్‌లో కలకలం రేపింది.

ఉపసంహరణ వెనుక హైడ్రామా.. 
జెడ్పీ చైర్మన్‌ పదవి రేసులో ఉన్న మాక్లూర్‌ జెడ్పీటీసీ ఏకగ్రీవం వెనుక హైడ్రామా కొనసాగిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల నుంచే మాక్లూర్‌ జెడ్పీటీసీ స్థానానికి నామినేషన్లు వచ్చాయి. స్వతంత్రులెవరూ నామినేషన్‌ వేయలేదు. ఇక్కడ కాంగ్రెస్‌తో పాటు బీజేపీ అభ్యర్థి కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బీజేపీ అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెచ్చింది కాంగ్రెస్‌ అభ్యర్థేనని సమాచారం. బీజేపీ అభ్యర్థిని బరిలోంచి తప్పించి, తాను కూడా పోటీ నుంచి తప్పుకోవడం వెనుక హైడ్రామా సాగిందని సమాచారం.
 
జెడ్పీ పీఠంపై కన్నేసి.. 
జిల్లా పరిషత్‌పై మరోమారు గులాబీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న గులాబీ పార్టీ ఎత్తుగడలకు కాంగ్రెస్‌ చిత్తవుతోంది. టీఆర్‌ఎస్‌ ఆచితూచి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపితే, కాంగ్రెస్‌ నాయకత్వం మాత్రం అభ్యర్థుల ఎంపికలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో విమర్శలకు దారితీస్తోంది. రాజకీయ పార్టీలను క్షేత్ర స్థాయిలో బలంగా ఉంచడంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఎంతో కీలకం. అలాంటి పదవులకు జరుగుతున్న ఎన్నికలను టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ కాంగ్రెస్‌ మాత్రం తీవ్ర నిరుత్సాహంలో కనీస పోటీ ఇవ్వలేక కొట్టుమిట్టాడుతోంది.

దూరంగా నియోజకవర్గ ఇన్‌చార్జీలు.. 
జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఆకుల లలిత టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆర్మూర్‌ అసెంబ్లీ స్థానానికి ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌చార్జి లేకుండా పోయారు. మిగిలిన నియోజకవర్గాల్లోని ఇన్‌చార్జీలు కూడా తమకేదీ పట్టనట్లు వ్యవహరిస్తుండటం ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురి చేస్తోంది.  

మరిన్ని వార్తలు