అదే హవా !

8 Jun, 2019 13:14 IST|Sakshi
ఐనవోలు ఎంపీపీ మధుమతిని అభినందిస్తున్న సహచరులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మండల పరిషత్‌ అ«ధ్యక్షుల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) హవా కొనసాగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 71 మండలాలు ఉండగా.. రిజర్వేషన్ల వివాదం కారణంగా ములుగు జిల్లా మంగపేట మండలంలో ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. ఇక 70 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరగ్గా.. శుక్రవారం మూడు మండలాలు మినహా మిగతా చోట్ల మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. ఇందులో 57 మండల పరిషత్‌లపై టీఆర్‌ఎస్‌ గులాబీ జెండా ఎగురవేసింది.

కాంగ్రెస్‌కు తొమ్మిది
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది ఎంపీపీ పీఠాలు కాంగ్రెస్‌కు దక్కగా, ఒకచోట ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ) పార్టీ అభ్యర్థి ఎన్నికయ్యారు. ఇక పలిమెల మండలంలో ఇద్దరు ఎంపీటీసీలే ఉన్న కారణంగా అక్కడ ఎన్నిక జరపలేదు. కాగా, మహదేవపూర్‌లో మెజార్టీ ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో ఎన్నిక వాయిదా వేశారు. అలాగే ఎంపీపీల ఎన్నికకు ముందు కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు. అయితే, తరిగొప్పుల మండలం కోఆప్షన్‌ పదవికి ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో అక్కడా ఎంపీపీ ఎన్నిక వాయిదా వేశారు.

వరంగల్‌ అర్బన్, రూరల్‌లో క్లీన్‌ స్వీప్‌
మండల పరిషత్‌ అధ్యక్షుల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ములుగు రెండు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మూడు కలిపి ఐదు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మహబూబాబాద్‌ జిల్లాలో రెండు, జనగామ, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకుంది. ఇక వరంగల్‌ అర్బన్‌ జిల్లాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ మొత్తం స్థానాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఈ జిల్లాలో మొత్తం ఏడు మండల పరిషత్‌లకు ఎన్నికలు జరగ్గా.. ఏడు చోట్లా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మొత్తం 16 మండలాలకు గాను 15 మండలాల్లో గులాబీ జెండా ఎగరగా.. గీసుకొండ ఎంపీపీగా కాంగ్రెస్‌ ఎంపీటీసీ ఎన్నికయ్యారు. జనగామ జిల్లాలో 12 ఎంపీపీలకు 10 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించగా, తరిగొప్పుల ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. రఘునాథపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి మేకల వీరలక్ష్మి ఎంపీపీగా ఎన్నికయ్యారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మొత్తం 11 ఎంపీపీలకు చిట్యాల, రేగొండ, టేకుమట్ల, భూపాలపల్లి, మొగుళ్లపల్లిల్లో టీఆర్‌ఎస్, మహాముత్తారం, కాటారం, మల్హర్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది. ఘనపురంలో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ జిల్లాలోని పలిమెల ఎంపీపీ ఎన్నిక రద్దు కాగా, మహదేవపూర్‌ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. ములుగు జిల్లాలో ఎనిమిది మండల పరిషత్‌లకు ఆరు టీఆర్‌ఎస్‌ గెలుచుకోగా, కన్నాయగూడెం, వెంకటాపురం(కె)ల్లో కాంగ్రెస్‌ ఎంపీటీసీలు ఎంపీపీలు ఎన్నికయ్యారు. అలాగే, మహబూబాబాద్‌ జిల్లాలో 16 స్థానాలకు 14 టీఆర్‌ఎస్, 2 కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకుంది.

మరిన్ని వార్తలు