‘కాంగ్రెస్‌ నేతల ఆస్తులపై విచారణకు సిద్ధమేనా’

17 Jul, 2018 01:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధమేనా అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎన్‌.భాస్కర్‌రావు సవాల్‌ చేశారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ దశాబ్దాలుగా అధికారంలో ఉంటూ కోట్లాది రూపాయల అక్రమార్జన కు పాల్పడిన కాంగ్రెస్‌ నేతలే అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీఆర్‌ఎస్‌ అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అవుతుం టే కాంగ్రెస్‌ నేతలు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారన్నారు.

తెలంగాణ ఉద్యమ సందర్భం గా ద్రోహులకు సద్ది మోసిన చరిత్ర కాంగ్రెస్‌దని అన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని నవాజ్‌ షరీఫ్‌ కుటుంబంతో పోల్చిన కోమటిరెడ్డికి పిచ్చి ముది రిందని, కాంగ్రెస్‌ నేతలకు 2019 ఎన్నికలే చివరి వని హెచ్చరించారు. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వంటివారే కుటుంబపాలన గురించి మాట్లాడటం విడ్డూరమని భాస్కర్‌రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ నేతల దిగజారుడు విమర్శలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని శేఖర్‌రెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు