ఒకే విడతలో రూ.లక్ష రుణమాఫీ: కేటీఆర్‌

4 Nov, 2018 16:48 IST|Sakshi

యాదాద్రి: వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఒకే విడతలో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ..పాక్షిక మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పింఛన్‌ను రూ.2016 పెంచుతామని, పింఛన్‌ వయోపరిమితిని 58 ఏళ్లకు తగ్గించబోతున్నామని , నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి కల్పించబోతున్నామని తెలిపారు.  దేశంలో రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు.

రైతుల పంట సాయాన్ని ఎకరానికి రూ.8 వేల నుంచి 10 వేలకు పెంచుతామని తెలిపారు. యాదాద్రి టెంపుల్‌ను తిరుపతికి ధీటుగా తీర్చిదిద్దుతున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడం కోసం కాంగ్రెస్‌ నేతలు కోర్టు మెట్లు ఎక్కారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడం కోసం కాంగ్రెసోళ్లు, చనిపోయిన వ్యక్తుల పేరుతో దొంగవేలిముద్రలు వేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ముసలి నక్క కాంగ్రెస్‌- గుంట నక్క చంద్రబాబు ఒక్కటై మహాకూటమి పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణాలో ప్రాజెక్టులను ఆపడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ అభ్యర్థుల సీట్ల కేటాయింపు చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందని అన్నారు. గొంగిడి సునీత మరోసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. త్వరలోనే రాయగిరి వరకు మెట్రో రైల్‌ రాబోతోందని వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గంలో లక్షా 70 వేల ఎకరాలకు కాళేశ్వం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 100 స్థానాలు గెలిచి, కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించాలని కోరారు.
 

మరిన్ని వార్తలు