హైదరాబాద్‌ రా... మాట్లాడుదాం!

11 Sep, 2018 19:47 IST|Sakshi
గృహనిర్బంధంలో ఉన్న ఓదెలు

కేసీఆర్‌ హామీతో స్వీయ గృహ నిర్బంధ దీక్ష విరమించిన ఓదెలు

ఉదయం నుంచి సాయంత్రం వరకు మందమర్రిలో హైడ్రామా

ఒప్పించేందుకు మంత్రి ఇంద్రకరణ్, ఎంపీ సంతోష్‌ విఫలయత్నం

కేసీఆర్‌ జోక్యంతో నిరసన విరమణ

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూర్‌ సీటును పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంపై తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మందమర్రిలోని తన నివాసంలో సోమవారం రాత్రి నిద్రపోయిన ఓదెలు కుటుంబం మంగళవారం ఇంటి నుంచి బయటకు రాలేదు. క్వార్టర్స్‌ ప్రధాన గేటుతో పాటు ఇంటికి ఉన్న అన్ని దర్వాజాలను మూసివేసి స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. గన్‌మన్లను కూడా బయటే ఉంచిన ఓదెలు ఇంటి లోపలికి ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రంలోగా తనకు చెన్నూర్‌ టికెట్టు ఇస్తున్నట్లు ప్రకటిస్తేనే తలుపులు తీస్తామని, లేదంటే ఏం జరుగుతుందో కూడా తెలియదని హెచ్చరించారు.  

ఉదయం నుంచి హైడ్రామా!
ఓదెలు గృహ నిర్బంధంలోకి వెళ్లారనే ప్రచారం మంగళవారం ఉదయం 9.15 గంటలకు దావానలంలా వ్యాపించింది. దాంతో కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన నివాసం ఎదుట బైఠాయించారు. మంత్రులు, పార్టీ పెద్దల నుంచి పిలుపు వస్తే తప్ప తాను బయటకు వచ్చేది లేదంటూ ఓదెలు చాలా స్పష్టమైన సంకేతాన్ని పార్టీ వర్గాలకు ఇచ్చారు. అయితే.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌ ఓదెలుకు సర్ది చెప్పేందుకు విఫలయత్నం చేశారు. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కేసీఆర్‌ స్వయంగా ఓదెలుకు ఫోన్‌ చేసి ‘రేపు ప్రగతిభవన్‌లో ఉండేలా హైదరాబాద్‌ బయలు దేరి వచ్చేయ్‌..’ అని చెప్పడంతో గృహ నిర్బంధం వీడారు.  

కేసీఆర్‌నే నమ్ముకున్నా: ఓదెలు  
తాను కేసీఆర్‌నే నమ్ముకున్నానని ఓదెలు స్పష్టం చేశారు. స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిన ఆయన ఫోన్‌లో ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడారు. ఈనెల 6న ప్రకటించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేనందుకు మనస్తాపానికి గురైనట్లు వెల్లడించారు. ఉద్యమం పురుడు పోసుకున్న నాటి నుంచి కేసీఆర్‌ వెంటే ఉన్నానని తెలిపారు. ఇప్పటికీ కేసీఆర్‌ తననే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారన్న నమ్మకం ఉందని ఓదెలు స్పష్టం చేశారు. బాల్క సుమన్‌ తప్పుడు నివేదికలు ఇచ్చారని, కేసీఆర్‌ తన వేగుల ద్వారా సర్వే చేయించాలని, ఆ సర్వేలో వచ్చే రిపోర్టుకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఇప్పటికీ రేకుల ఇంట్లో ఉంటున్నానని, తనకు టిక్కెట్టు ఇవ్వాలని ఓదెలు ఉద్విగ్నంగా చెప్పారు.

మరిన్ని వార్తలు