‘సహకార’ బరి.. డీసీసీబీ పీఠంపై గురి 

10 Feb, 2020 03:03 IST|Sakshi

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఎన్నికల నేపథ్యంలో బరిలో ముఖ్య నేతలు

కేటీఆర్‌ను కలిసిన ఔత్సాహికులు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రయత్నం

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలక మండలి ఎన్నికలు పూర్వపు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో డీసీసీబీ చైర్మన్‌ పదవులపై కన్నేసిన టీఆర్‌ఎస్‌ నేతలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలపై దృష్టి సారించారు. పీఏసీఎస్‌ డైరెక్టర్లుగా, ఆ తర్వాత పీఏసీఎస్‌ చైర్మన్లుగా ఎన్నికైతేనే డీసీసీబీ అధ్యక్ష పీఠానికి పోటీపడే అవకాశం ఉం టుంది. దీంతో డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్న పలువురు నేతలు పీఏసీఎస్‌ స్థాయి లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తమ వంతు ప్రయత్నా లు సాగిస్తున్నారు. రాష్ట్రంలో 905 పీఏసీఎస్‌ల పరిధిలోని 12,100 డైరెక్టర్‌ స్థానాలకు శనివారంతో నామినేషన్ల స్వీకరణ ముగిసింది.

సోమవారం ఉపసంహరణకు గడువు ఉండటంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్య క్ష పదవిని ఆశిస్తున్న నేతలు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో జరిగిన సహకార ఎన్నికల్లో తెలంగాణలోని 9పూర్వపు జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు కాంగ్రెస్‌ మద్దతుదారులే గెలిచారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరంగల్‌ మిన హా మిగతా 8 జిల్లాల డీసీసీబీ అధ్యక్షుడు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. గతంలో టీఆర్‌ఎస్‌లో చేరిన డీసీసీబీ అధ్యక్షుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారు మరోమారు అదే పదవిని ఆశిస్తూ సహకార ఎన్నికల్లో పీఏసీఎస్‌ డైరెక్టర్‌ స్థానాలకు నామినేషన్లు దాఖ లు చేశారు. మరో వారంలో పీఏసీఎస్‌ స్థాయిలో ఎన్నిక పూర్తవ్వనుండటంతో, డీసీసీబీ అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు పూర్వపు ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ముఖ్యనేతలతో సమావేశాలు జరపాల్సిందిగా సంబంధిత జిల్లాలకు చెందిన మంత్రులను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన –ఉమ్మడి వరంగల్‌ జిల్లా సమావేశం పూర్తికాగా, త్వరలో ఇతర జిల్లాల నేతలు కూడా భేటీ కానున్నారు.

మెదక్‌ డీసీసీబీ బరిలో పద్మా దేవేందర్‌రెడ్డి భర్త
మెదక్‌ డీసీసీబీ పదవిని ఆశిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డి కొండపాక సొసైటీ పరిధిలో మరోమారు పోటీ చేస్తున్నారు. మెదక్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి భర్త కూడా కోనాపూర్‌ సొసైటీ నుంచి బరిలోకి దిగారు. గతంలో రెండు పర్యాయాలు వరుసగా కోనాపూర్‌ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికవ్వగా, ప్రస్తుతం మూడోసారి పోటీ చేస్తున్నారు. వరంగల్‌ డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సన్నిహితుడు మార్నేని రవీందర్‌రావు సింగారం సొసైటీ పరిధిలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఆదిలాబాద్‌ డీసీసీబీ అధ్యక్ష పదవిని మరోమారు ఆశిస్తూ ఎం.దామోదర్‌ రెడ్డి తలమడుగు పీఏసీఎస్‌ నుంచి పోటీ చేస్తుం డగా, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి తాంసి పీఏసీఎస్‌ పరిధిలో నామినేషన్‌ వేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పదవిని ఆశిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బి.మనోహర్‌రెడ్డి కుల్కచర్ల పీఏసీఎస్‌ పరిధిలో డైరెక్టర్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు.

ఇప్పటికే కేటీఆర్‌ను కలిసిన ఔత్సాహికులు
డీసీసీబీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావును కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. కరీంనగర్‌ డీసీసీబీ అధ్యక్షుడిగా, రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్‌ చైర్మన్‌గా పనిచేసిన కొండూరు రవీందర్‌రావు మరోమారు అదే పదవిని ఆశిస్తూ, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఏసీఎస్‌ పరిధిలో డైరక్టర్‌ స్థానానికి నామినేషన్‌ వేశారు. గతంలో టెస్కాబ్‌ చైర్మన్‌గా స్వల్ప కాలం పనిచేసిన ఎడవెళ్లి విజయేందర్‌రెడ్డి నల్గొండ డీసీసీబీ అధ్యక్ష పదవిని దృష్టిలో పెట్టుకుని బరిలోకి దిగారు. మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సొసైటీ డైరక్టర్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి దేశాయిపేట పీఏసీఎస్‌ పరిధిలో నామినేషన్‌ వేశారు. మహబూబ్‌నగర్‌ డీసీసీబీ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కొడంగల్‌ పీఏసీఎస్‌ పరిధిలో పోటీకి దిగారు.

మరిన్ని వార్తలు