ఎందుకిలా..

4 Sep, 2018 08:35 IST|Sakshi

ప్రగతి సభకు తగ్గిన జనసమీకరణ

నిర్దేశిత లక్ష్యంలో సగం మందే రాక

వనరులు సమకూర్చినా ఆశించిన స్థాయిలో రాని జనం

పోస్టుమార్టం నిర్వహిస్తున్న అధిష్టానం

జిల్లా నాయకత్వంపై హైకమాండ్‌ గుర్రు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రగతి నివేదనపై టీఆర్‌ఎస్‌ నాయకత్వం అంతర్గత మథనం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా భావించిన సభకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ జరపకపోవడంపై పోస్టుమార్టం నిర్వహిస్తోంది. కొంగరకలాన్‌లో సభ నిర్వహిస్తున్నందున కనిష్టంగా ఐదారు లక్షల మందిని తరలించాలని జిల్లా నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఐదారు లక్షలు దేవుడెరుగు కనీసం మూడు లక్షల మందిని కూడా తరలించకపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ప్రగతి నివేదన సభకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన గులాబీ బాస్‌.. ప్రజల తరలింపుపై లెక్కలు తీశారు. అలాగే నిఘావర్గాలిచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన అధిష్టానం.. ప్రగతి సభకు జన సమీకరణలో జిల్లా నాయకత్వం వైఫల్యం చెందినట్లు అంచనా వేసింది.

నివేదన సభకు ఆతిథ్యమిచ్చిన ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలే కాకుండా షాద్‌నగర్, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల సెగ్మె ంట్ల నుంచి నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జనాలను సమీకరించలేదని తేలింది. బహిరంగ సభకు ముహూర్తం ఖరారు కాగానే రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నివాసంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రత్యేక భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సెగ్మెంట్‌ నుంచి సగటున 35 వేల నుంచి 40వేల మందిని సభకు తరలించాలని నిర్ణయించారు.  కేవలం ప్రజా ప్రతినిధులేగాకుండా ఆశావహులు సైతం బలప్రదర్శన చేసుకునేందుకు భారీగా జనాలను తీసుకొస్తారని అంచనా వేశారు. ఈ లెక్కలు తప్పడంపై తాజాగా గులాబీ నేతలు చింతిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి జనాలు పోటెత్తుతారని ఎవరికివారు మిన్నకుండడం కూడా ఈ పరిస్థితికి దారితీసిందని అంటున్నారు. ఆర్థిక వనరులు సమకూర్చినా ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయలేకపోవడాన్ని హైకమాండ్‌ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి నేతలపై క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్న గులాబీ దళపతి.. త్వరలోనే వీరికి క్లాస్‌ పీకనున్నట్లు తెలుస్తోంది.

బాగా పనిచేశారు..
బహిరంగ సభ నిర్వహణలో విశేష కృషి చేసిన వారిని అభినందించేందుకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వల్ప వ్యవధిలో ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పూర్తి చేసిన వారికి ట్రీట్‌ ఇవ్వాలని నిర్ణయించిన ఆయన క్యాంపు ఆఫీసుకు రావాలని ఆహ్వానించారు.   

నిఘా విభాగం మల్లగుల్లాలు!
ప్రగతి నివేదన సభకు హాజరైన ప్రజల సంఖ్య తేల్చడంలో ఇంటలిజన్స్‌ విభాగం తలమునకలైంది. మంగళవారం భేటీ అయిన నిఘా బృందాలు ఏయే జిల్లా, నియోజకవర్గాల నుంచి ఎన్ని వాహనాలు, ఎంతమంది వచ్చారనే అంశంపై సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అదే సమయంలో రాష్ట్రం నలు దిక్కుల నుంచి ఒకేసారి జనప్రవాహం రావడంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోయినట్లు వివరించినట్లు తెలిసింది. సగం మంది సభకు రాకుండా రోడ్లపైనే నిలబడ్డారని, మరికొందరు ముందుకు రాలేక వెనక్కిపోయినట్లు పార్టీ వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం.. పోలీసుల బందోబస్తు నిర్వహించిన తీరుపై పెదవి విరిచినట్లు తెలిసింది. నిర్దేశిత మార్గాల గుండా వాహనాలను సభాస్థలికి చేర్చడంలో ఆ శాఖ వైఫల్యం ఉందని అన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు