టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభకు కేకే, పొంగులేటి!

11 Mar, 2020 02:26 IST|Sakshi

నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం 

శాసనమండలి అభ్యర్థుల కసరత్తు కూడా పూర్తి చేసిన కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కోటాలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్‌ కె. కేశవరావు మరోమారు రాజ్యసభకు వెళ్లనున్నారు. రెండో స్థానానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. పార్టీ తరఫున పలువురు నేతలు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించినా చివరకు ఈ ఇద్దరు నేతల వైపే కేసీఆర్‌ మొగ్గుచూపినట్లు తెలిసింది. నిజామాబాద్‌ మాజీ ఎంపీలు కవిత, ప్రొఫెసర్‌ సీతారాం నాయక్, మందా జగన్నాథం రాజ్యసభ ఆభ్యర్థిత్వాన్ని ఆశించిన వారి జాబితాలో ఉన్నారు. వారితోపాటు దామోదర్‌రావు, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, హెటిరో సంస్థల అధినేత పార్థసారథిరెడ్డి పేర్లను కూడా సీఎం పరిశీలించినట్లు తెలిసింది. 

చివరకు వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కేకే, పొంగులేటి అభ్యర్థిత్వం వైపు కేసీఆర్‌ మొగ్గు చూపినట్లు తెలిసింది. అయితే అభ్యర్థిత్వం ఖరారైనట్లుగా ప్రచారంలో ఉన్న నేతలు మాత్రం తమకు పార్టీ నుంచి సమాచారం అందలేదని మంగళవారం రాత్రి ధ్రువీకరించారు. ఈ నెల 13న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నామినేషన్‌కు తుది గడువు ఉండటంతో రాజ్యసభ అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా అసెంబ్లీ మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, గవర్నర్‌ కోటా అభ్యర్థిగా సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ పేర్లను సైతం సీఎం ఖరారు చేసినట్లు సమాచారం. ఈ నెల 12న మండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానానికి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.  

మరిన్ని వార్తలు