కవిత స్వగ్రామంలో మరో చేదు ఫలితం!

4 Jun, 2019 12:52 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : తాజాగా వెలువడుతున్న పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన ఎంపీటీసీ ఫలితాలను చూసుకుంటే దాదాపు అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎక్కువసంఖ్యలో ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక, పరిషత్‌ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమార్తె, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత స్వగ్రామం పోతంగల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమి పాలయ్యారు.

పోతంగల్‌ ఎంపీటీసీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి రాజు 95 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లోనూ కవితకు చేదు ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. పెద్దసంఖ్యలో రైతులు పోటీచేయడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ చేతిలో భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా భావించిన నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంతోపాటు కరీంనగర్‌ స్థానంలోనూ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలుపొంది.. బీజేపీ రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు