కారు.. సారు.. నూటికి నూరు

17 Mar, 2019 01:04 IST|Sakshi

లోక్‌సభ పోరులో టీఆర్‌ఎస్‌కే చాన్స్‌ ఎక్కువ 

కనుచూపుమేర పోటీలో కనిపించని ప్రతిపక్షాలు 

అభివృద్ధి పథకాలు.. కేసీఆర్‌ ఇమేజ్‌కు విపక్షాలు కుదేలు 

అధికార పార్టీలోకి క్యూ కడుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

నాయకత్వ లోపంతో బీజేపీ బేజారు 

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల సన్నాహ సభలను ప్రారంభిస్తూ.. ‘కారు.. సారు.. పదహారు’ అని తమ విజయ నినాదంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. సహజంగానే రాజకీయ పార్టీల నాయకులు తమ విజయావకాశాలను కొంచెం ఎక్కువగా అంచనా వేసి చెబుతుంటారు. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరిస్తే కేటీఆర్‌ వ్యాఖ్యల్లో అతిశయోక్తేమీ కనిపించడంలేదు. సరిగ్గా నామినేషన్ల ఘట్టానికి రెండు రోజుల ముందు పరిస్థితిని నియోజకవర్గాల వారీగా మదింపు చేస్తే ‘వార్‌ వన్‌ సైడ్‌’గానే కనిపిస్తోంది. పదహారు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మిత్రపక్షమైన మజ్లిస్‌తో కలిసి తెలంగాణలోని మొత్తం 17 స్థానాలను గెలవొచ్చు. 100% మార్కులకు అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇందుకు కారణాలు సుస్పష్టం. టీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే రెండు వరుసలుగా ఉన్న బలమైన కోటలను దాటాల్సి ఉంటుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బలిష్టంగా నిర్మించుకున్న కోట మొదటిది. ఇప్పుడిప్పుడే దీన్ని దాటి వెళ్లడం ఎవరికీ సాధ్యం కాదు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి ఈ కోటను దాటినా శత్రుదుర్భేద్యమైన మరో కోట టీఆర్‌ఎస్‌కు రక్షణగా ఉంది. అదే కేసీఆర్‌ ఇమేజ్‌. జనంలో కేసీఆర్‌ నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని చెదరగొట్టడం అంత సులభం కాదు.  

ఖాళీ అవుతున్న కాంగ్రెస్‌ 
కాంగ్రెస్‌ పార్టీలోని బలమైన ఎమ్మెల్యేలు సైతం టీఆర్‌ఎస్‌లోకి వరుసకట్టడం వెనుక ఈ క్షేత్రస్థాయి పరిస్థితుల ప్రభావం ఉంది. మొదట ఇద్దరు ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలు పార్టీ మారినపుడు వారికి వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో ధర్నాలు, ప్రదర్శనలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపును ఎవరూ పట్టించుకోకపోగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వారి ప్రాంతాల్లో స్వాగతం లభించింది. ఈ ఒక్క మెతుకు చాలు. టీఆర్‌ఎస్‌ అన్నం ఉడికింది అని చెప్పడానికి. ఎన్నికల్లో ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ ఇమేజ్‌తోపాటు ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌ గెలుపునకు దోహదపడే అంశాలు చాలా కన్పిస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ విజయానికి దోహదపడే పరిస్థితులు ఉన్నాయి. సంక్షేమ పథకాలకు తోడు.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ, పాలమూరు ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు గ్రామాల్లో సానుకూలత పెరుగుతోంది. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్‌ కిట్, వ్యవసాయానికి నిరంతర కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు, ఏప్రిల్‌ నుంచి పింఛన్లు రెట్టింపు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూలం కానున్నాయి. 

ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో 6 చోట్ల టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఆసిఫాబాద్‌లో గెలిచిన ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థి  లేకపోవడం అధికార పార్టీకి అనుకూలంగా మారుతోంది. గిరిజనులకు పోడు భూములు ఇచ్చే వ్యవహారం టీఆర్‌ఎస్‌కు అనుకూలం కానుంది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మిల్లు పునరుద్ధరణతో ఆ ప్రాంతంలో అధికార పార్టీకి అనుకూలత పెరగనుంది. 

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో విజయంపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసేందుకు ముఖ్యనేతలు ఎవరూ ముందుకు రావడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సెగ్మెంట్‌లోని మొత్తం ఏడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం సానుకూలాంశం. నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైను పూర్తి కావడం, రైలు రాకపోకలు ప్రారంభం కావడం టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీకి అనుకూలమైన అంశం. 

కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలో టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఉంది. తెలంగాణ సెంటిమెంట్, టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న ఈ సెగ్మెంట్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కాంగ్రెస్‌ ఉనికిలేకుండా పోయింది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణ, మిడ్‌ మానేరుకు నీటి లభ్యత వంటివి ఇక్కడ ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. 

పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. మంథని మినహా అన్ని సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉండే సింగరేణి కార్మికులు ఇక్కడ ఫలితాలపై ప్రభావం చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రభావిత స్థానాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో వీరు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారనుంది. ఎస్సారెస్పీ కాలువ ఆధునీకరణ, కాళేశ్వరం ప్రాజెక్టుతో టీఆర్‌ఎస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. 

మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 6అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత హరీశ్‌రావు ఈ సెగ్మెంట్‌ పరిధిలోనే ఉండడంతో మెదక్‌ లోక్‌సభ స్థానంలో భారీ విజయంపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే పనులు పూర్తి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు వస్తోందనే ప్రజలు నమ్ముతున్నారు. 

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 7అసెంబ్లీ సెగ్మెంట్లలో 6చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభలో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ పెరిగే పరిస్థితి ఉంది. సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌ సామాజికవర్గానికి చెందిన వారు ఈ సెగ్మెంట్‌లో మూడు లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. బీడీ కార్మికులు కామారెడ్డి జిల్లాలో 33 వేల మందికి జీవనభృతి అందుతోంది. రైతుబంధుతో రైతులకు ప్రయోజనం కలిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రైతులకు ఎన్నో ఆశలున్నాయి. కాంగ్రెస్‌లో నాయకత్వ సమస్య టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశాలు. 

నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంలో 7అసెంబ్లీ సెగ్మెంట్లలో 6చోట్ల టీఆర్‌ఎస్‌ గెలిచింది. ఒక్క హుజూర్‌నగర్‌లో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలిచారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే ఎక్కువశాతం విజయఢంగా మోగించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న ఈ ఎంపీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చాయి. కాంగ్రెస్‌ శ్రేణులు ఈ షాక్‌ నుంచి ఇంకా తేరుకోలేదు. నల్లగొండ లోక్‌సభ పరిధిలో 2 ప్రభుత్వ వైద్య కాలేజీల ఏర్పాటు, సంక్షేమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయి. 

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 5చోట్ల టీఆర్‌ఎస్‌ గెలిచింది. నకిరేకల్‌ నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఒక్కరే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌.. బీబీనగర్‌కు నిమ్స్‌ సాధించడంలో ప్రధానపాత్ర పోషించారు. ఎయిమ్స్‌ ఏర్పాటు, కేంద్రీయ విద్యాలయం, భువనగిరిలో పాస్‌పోర్ట్‌ కేంద్రం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో అనుకూల అంశాలుగా ఉండనున్నాయి. కాంగ్రెస్‌లో ఐక్యత కనిపించడం లేదు. ఎవరికి టికెట్‌ వచ్చినా కలిసికట్టుగా పనిచేసే వాతావరణం లేదు. 

వరంగల్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌కు పెట్టని కోటగా ఉంటోంది. ఈ సెగ్మెంట్‌ పరిధిలో భూపాలపల్లి మినహా ఆరు సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచారు. వరంగల్‌ లోక్‌సభను వరుసగా టీఆర్‌ఎస్‌ భారీ మెజారిటీతో గెలుచుకుంటోంది. 2015 ఉపఎన్నికలో పసునూరి దయాకర్‌ 4,59,403 ఓట్ల రికార్డు మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థిపై గెలిచారు. కాళేశ్వరం, దేవాదుల నీళ్లు, ఎస్సారెస్పీ కాకతీయ కాల్వల మరమ్మతు, ఉచిత విద్యుత్, రైతుబంధు సహా పలు పథకాలు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా మారనున్నాయి. 

మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ 4, టీఆర్‌ఎస్‌ మూడు స్థానాల్లో గెలిచాయి. తాజాగా ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతుండడంతో లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ బలం పెరుగుతోంది. కాంగ్రెస్‌ శ్రేణులు డీలా పడ్డాయి. పోడుభూముల సమస్య అధికార పార్టీతోనే పరిష్కారమవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. 

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉండే పరిస్థితి ఉంది. కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒకే సెగ్మెంట్‌లోనే గెలిచినా.. ఇటీవల కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు (నలుగురు) టీఆర్‌ఎస్‌లో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లోపు ఇంకా మార్పులు జరిగడం ఖాయంగా కనబడుతోంది. 

చేవేళ్ల లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌కు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోక్‌సభ పరిధిలోని 7అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ 5స్థానాల్లో గెలిచింది. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్లలో 55% టీఆర్‌ఎస్‌కు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇలాగే ఉంటే అధికార పార్టీ ఆధిక్యత సాధించనుంది. 

మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌లో విజయంపై టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకుతోడు నూతన పారిశ్రామిక విధానంతో కొత్త పరిశ్రమలు ఏర్పడి వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో మౌలికవసతుల కల్పన టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంది. లోక్‌సభ పరిధిలోని 6సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాంగ్రెస్‌లో ఐక్యత లేకపోవడంతో అధికార పార్టీకి అనుకూల అంశాలుగా ఉండనున్నాయి. 

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ పరిధిలోని మొత్తం 7అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉండడంతో గెలుపుపై అధికార పార్టీ ధీమాతో ఉంది. 14 లక్షల ఎకరాలకు సాగునీరందించే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో సానుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. భీమా ప్రాజెక్టుతో మక్తల్‌ నియోజకవర్గ పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకంతో దేవరకద్ర సెగ్మెంట్‌లో సాగునీరు అందిస్తున్నారు. ఇవన్నీ టీఆర్‌ఎస్‌ సానుకూలత పెంచనున్నాయి. 

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లోని ఒక్క కొల్లాపూర్‌ మినహా మిగిలిన 6అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. సిట్టింగ్‌ ఎంపీ నంది ఎల్లయ్య అందుబాటులో ఉండరంటూ.. ప్రజల్లో అభిప్రాయం ఉంది. సాగునీటి ప్రాజెక్టులతో నాగర్‌కర్నూల్‌ సెగ్మెంట్‌లోని ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టు రైతులకు శాశ్వత పరిష్కారం కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టి వెంటనే పూర్తి చేయడం అధికార పార్టీకి అనుకూలంగా మారింది. 

సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానంలోని రాజకీయ పరిస్థితులు టీఆర్‌ఎస్‌కు గతంలో ఎప్పుడూ లేనంత అనుకూలంగా ఉన్నాయి. లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలోని 7అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ 6, ఎంఐఎం ఒక స్థానంలో గెలిచాయి. ప్రభుత్వం చేపడుతున్న రహదారుల పనులు, పట్టణ మిషన్‌ భగీరథ పథకం కింద నిరుపేదల బస్తీల్లోనూ ఇంటింటికీ నల్లా ఏర్పాటు పనులతో టీఆర్‌ఎస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్‌లోని అంతర్గత కలహాలు ఆ పార్టీకి ఎన్నికల్లో ప్రతికూలంగా మారనున్నాయి. ఈ స్థానంలో గట్టి పోటీ ఇచ్చే బీజేపీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌సభ పరిధిలో ఒక్క స్థానం గెలవలేదు. నాయకత్వ లోపం బీజేపీకి ప్రతికూలంగా మారింది.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు