పిలగాడు ఆగం పట్టడం ఖాయం : మంత్రి నాయిని

5 Aug, 2018 08:58 IST|Sakshi
సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

ప్రాజెక్టుల విషయంలో మేము చెప్పిందే నిజమైంది జూరాలపై ఆధారపడితే ఎత్తిపోతల పథకాలకు భంగపాటే నారాయణపేట, కొడంగల్‌కు పాలమూరు–రంగారెడ్డి ద్వారా సాగునీరు కోస్గి బహిరంగ సభలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు  బస్‌డిపో, బస్టాండ్‌ పనులకు శంకుస్థాపన, సీఐ కార్యాలయం ప్రారంభం హాజరైన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి  ఐటీఐ కాలేజీ ఏర్పాటుకు మంత్రి నాయిని హామీ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: నాలుగేళ్లుగా పాలమూరు ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసైనా కాంగ్రెస్‌ నేతలు కళ్లు తెరవాలని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు మున్ముందు మరింత సమర్థవంతంగా అందాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. జిల్లాలోని కోస్గిలో బస్‌ డిపో నిర్మాణ పనులతో పాటు బస్‌స్టేషన్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా పోలీస్‌సర్కిల్‌ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. మంత్రులు పట్నం మహేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణతో కలిసి పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. ఆ తర్వాత మంత్రి పి.మహేందర్‌రెడ్డి అధ్యక్షతన కోస్గి జూనియర్‌ కాలేజ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగం ఆయన మాటల్లోనే..
 
మేం చెప్పిందే నిజమవుతోంది! 
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేము ముందు నుంచి చెబుతున్న మాటే నిజమైంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. ఈ రోజు జూరాల ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? ఈ ప్రాజెక్టు నుంచి మనం వాడుకోగలిగిన నీరు కేవలం 6టీఎంసీలు మాత్రమే. జూరాల మీద ఆధారపడి ఇప్పటికే నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలతో పాటు లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం పైనుంచి వరద ఆగిపోయే సరికి ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండు రోజులు పోతే ఎత్తిపోతల పంపులన్నీ నిలిపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాంటిది పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జూరాలను ఆధారంగా ఏర్పాటు చేస్తే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుందా? శ్రీశైలం డ్యామ్‌లో 215 టీఎంసీల నీరు ఉంటుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు ఎండాకాలం వచ్చే వరకు నడుస్తాయి.

అదే జూరాల మీద ఉన్న నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ పంపులను నడపగలమా? అందుకే సీఎం కేసీఆర్‌ ముందు చూపుతోనే పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఆధారం చేసుకొని చేపట్టారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్‌ నేతలు గుర్తించాలి. నారాయణపేట, కొడంగల్‌ ప్రాంతాలకు సాగునీరు అందించే విషయంలో జూరాలపై భారం వేయలేం. అయినా కచ్చితంగా పాలమూరు–రంగారెడ్డి ద్వారా నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గాల్లోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. కర్వెన రిజర్వాయర్‌ ద్వారా 1.30లక్షల ఎకరాలకు, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ ద్వారా 70వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రాబోయే రోజుల్లో ఇది చేసి చూపిస్తాం.
 
కేసుల వల్లే ఆలస్యం.. 
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగెత్తించాలని మేము భావిస్తుంటే కాంగ్రెస్‌ నేతలు కేసుల ద్వారా అడ్డుపడుతున్నారు. ఈ ప్రాజెక్టుపై పదుల సంఖ్యలో కేసులు వేసిన కారణంగానే అనుకున్నంత వేగంగా పనులు చేయలేకపోయాము. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల నల్లమల్ల అభయారణ్యం దెబ్బ తింటుందని కాంగ్రెస్‌ పార్టీ కొల్లాపూర్‌ ఇంచార్జీ హర్షవర్దన్‌రెడ్డి గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. అలాగే దేవరకద్రకు చెందిన పవన్‌కుమార్‌ హైకోర్టులో కేసులు వేశారు. ఇలాంటి చర్యల వల్లే ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి.  

గులాబీ జెండా ఎగరడం ఖాయం 
రాబోయే ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గం లో గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగెత్తిస్తున్నాం. మాయమాటల ద్వారా ఒకటి రెండు సార్లు మోసం చేస్తారేమో కానీ ఎల్లకాలం చెల్లుబాటు కాదు(రేవంత్‌ను ఉద్దేశించి). కోస్గికి గతంలో బస్‌డిపో మంజూరు కాకపో యినా మోసపూరితంగా శిలాఫలకం వేశారు. కానీ మేము అలా కాకుండా.. స్థానిక నేతలు అడిగిన వెంటనే 15 రోజుల్లోనే జీఓ మంజూరు చేశాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బస్‌ డిపోగా కోస్గి రికార్డుకెక్కింది. అలాగే ఆస్పత్రులు, మిషన్‌ కాకతీయ కింద చెరువుల పూడికతీత, పంచాయితీరాజ్‌ కింద రోడ్ల నిర్మాణం, విద్యుత్‌సబ్‌స్టేషన్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. త్వరలో బోరాంస్‌పేట, దౌల్తాబాద్‌కు జూనియర్‌ కాలేజీల ఏర్పాటు చేస్తాం. కోస్గిలో స్థలం గుర్తిస్తే అధునాతన కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తాం. 

అభివృద్ధి అంటే ఏందో తెలుసా..
కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి అభివృద్ధి అంటే ఏందో తెలియదని మంత్రి మహేందర్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో గ్రాఫిక్‌ చిత్రాలతో ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు గెలుపొందారని... ఇక మునుముందు వారి ఆటలు సాగవన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.900 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి వివరించారు. మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జెడ్పీ చైర్మన్‌ బండారి భాస్కర్, మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బి.శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రాబోయే ఎన్నికల్లో పిల్లగాడు ఆగం పట్టడం ఖాయమంటూ కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి హరీశ్‌రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం ఖాయమని... అందుకే ఈ నియోజకవర్గానికి ఆయన్ని ఇన్‌చార్జీగా సీఎం కేసీఆర్‌ నియమించారన్నారు. ఇక్కడ విజయం ఖాయమని... కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఆ పిల్లగాడిని అమ్మ దగ్గర పాలు తాగడానికి పంపించేలా ఉన్నారు. సీఎం కేసీఆర్‌ను తిట్టినోడు ఎవరూ బాగుపడలేదని...పిచ్చి కూతలు కూసే ఈ పిల్లగాడిది అదే పరిస్థితి అవుతుందని అన్నారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రధాని లాంటి జితేందర్‌రెడ్డి కోరిక మేరకు కోస్గిలో ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

మంత్రి నాయిని 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా