దమ్ముంటే రా.. ఎంపీకి ఎమ్మెల్యే సవాల్‌

17 Jan, 2020 18:15 IST|Sakshi

ఎంపీ అరవింద్‌కు బీగాల గణేష్‌ గుప్తా సవాల్‌

సాక్షి, నిజామాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్‌  ఎన్నికల వేడి పెరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ళు, బహిరంగ విమర్శలతో  నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ అరవింద్‌కు దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు రేపు (శనివారం) రావాలని సవాలు విసిరారు. నిజామాబాద్‌ మేయర్‌ సీటును ఎంఐఎంకు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్‌ రెడీ అయ్యారని అరవింద్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. పరోక్షంగా టీఆర్ఎస్ గెలుపు ఖాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక మేయర్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటరే అవుతారనీ,  ఎంఐఎంకు ఇచ్చే ప్రసక్తే లేదని గణేష్‌ గుప్తా తేల్చి చెప్పారు.

ఎన్నికల ప్రచారంలోభాగంగా పలు వార్డుల్లో శుక్రవారం గణేష్‌ గుప్తా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘పసుపు బోర్డ్ గురించి బాండ్ పేపర్ రాసి ఇచ్చి అరవింద్‌ మాట తప్పారు. మేము అలా తప్పుడు హామీలు ఇవ్వం. చెప్పింది చేసి చూపిస్తాం. మేము చేపట్టిన పనులు పూర్తి చేస్తాం అని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టడం శోచనీయం. ఎన్నికల ఓటమి భయంతో ఎంపీ అరవింద్ ఏదేదో మాట్లాడుతున్నారు. ఎంఐఎంకు మేయర్ సీట్ ఇస్తే కంఠశ్వర్ గుడి వరకు ముక్కు నెలకు రాస్తా. భైంసా ఘర్షణ విషయంలో నిరాహార దీక్ష చేసే ఆలోచన, వెనుక ఉన్న కుట్ర ఏంటి?. నిరాహార దీక్ష పేరుతో.. అరెస్ట్ చేస్తే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. దయచేసి మత విద్వేషాలు, వర్గాలు, కులాల మధ్య చిచ్చు పెట్టకండి. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకండి’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు