పౌరసత్వం రద్దుపై స్పందించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

20 Nov, 2019 19:18 IST|Sakshi

హైదరాబాద్‌: తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాలపై టీఆర్‌ఎస్‌ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు స్పందించారు. భారతీయ పౌరుడిగా తన పౌరసత్వ పరిరక్షణకు మళ్ళి హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన తెలిపారు. ద్వంద్వ పౌరసత్వ వివాదంలో జూలై 15, 2019న హైకోర్టు తీర్పు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చిందని, ఈ ఆదేశాలను కేంద్ర హోంశాఖ పరిగణలోకి తీసుకోకపోవడం శోచనీయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

‘నా పౌరసత్వాన్ని 2017లో కేంద్ర హోంశాఖ రద్దు చేయడంతో దీనిపై హైకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. అనంతరం సుదీర్ఘ వాదనలు విన్న న్యాయస్థానం గత జూలై 15న నా పౌరసత్వ రద్దును కొట్టివేసింది. పౌరసత్వ చట్టం నియమ నిబంధనల ప్రకారం నా దరఖాస్తులను సమగ్రంగా, హేతుబధ్ధంగా, వ్యక్తి సామాజిక నిబద్దతను పరిగణిస్తూ (సెక్షన్ 10.3) చూడాలే తప్ప సాంకేతికంగా విడదీసి విశ్లేషించరాదని హైకోర్టు ఆదేశించింది.  ఇదే విషయంలో మా రీ-అప్పీలుపై హైకోర్టు స్పందిస్తూ ఒక వేళ సెక్షన్ 10.3ను పరిగణించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా.. న్యాయం కోసం మళ్లీ తమ వద్దకు రావచ్చని తేల్చిచెప్పింది. ఈ ఆదేశాల మేరకే గత నెల 31న ఢిల్లీలో మరోసారి వాదనలు జరిగాయి. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోకపోవడం శోచనీయం’ అని అన్నారు. తన పౌరసత్వ పరిరక్షణకు మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తానని, తనకు తప్పక న్యాయం జరుగుతుందని చెన్నమనేని రమేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు