చోటెవరికి? 

8 Jan, 2019 02:20 IST|Sakshi

కేబినెట్‌ విస్తరణపై ఆశావహుల్లో ఉత్కంఠ

మంత్రివర్గంలో చోటు కోసం ఎమ్మెల్యేల ప్రయత్నాలు

6–8 మందికే అవకాశం ఉంటుందంటున్న పార్టీ అధిష్టానం

అన్ని పదవులు కలిపి 33 మందికి చాన్సివ్వడంపై సీఎం దృష్టి

ములుగు, నారాయణపేట సహా జిల్లాకు ఒకటి చొప్పున పదవి!

సామాజిక సమీకరణలతో జాబితా రూపకల్పన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంటుందనే వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణం కోసం జనవరి 17 నుంచి 20 వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని సీఎం నిర్ణయించడం, తొలిదశ విస్తరణలో ఆరు లేదా ఎనిమిది మందికే మంత్రులుగా అవకాశం ఉంటుందన్న సమాచారంతో ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం సామాజిక సమీకరణలు, జిల్లాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, చీఫ్‌ విప్‌లు, విప్‌ పదవులను దృష్టిలో పెట్టుకొని జాబితా రూపొందిస్తున్నారు.

ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తుండటంతో మొత్తం 33 జిల్లాలకు ప్రాతినిధ్యం ఉండేలా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎవరెవరికి అవకాశం ఉంటుందనే చర్చ టీఆర్‌ఎస్‌లో జోరుగా సాగుతోంది. డిసెంబర్‌ 13న కొత్త ప్రభుత్వం ఏర్పడగా ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా మహమూద్‌అలీ మాత్రమే ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఐదారు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కేసీఆర్‌ చెప్పినప్పటికీ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటన, ప్రాజెక్టుల పనుల పరిశీలన, వివిధ శాఖలపై వరుస సమీక్షల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు ఇప్పటివరకు వీలు కాలేదు. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం సైతం వాయిదా పడటం తెలిసిందే. 

విధేయులు, సమర్థులకే చోటు... 
రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా మరో 17 మంత్రి పదవులకు అవకాశం ఉంటుంది. శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవులను కలిపితే మరో నాలుగు అవుతాయి. శాసనమండలి, శాసనసభలలో చీఫ్‌ విప్, విప్‌ పదవులు ఉన్నాయి. కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శులను నియమించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. అన్నింటినీ కలిపి 33 పదవులు ఉండేలా సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ఆశావహులు సైతం ఎక్కువగానే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో విజయం సాధించింది. అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున రామగండంలో గెలిచిన కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థిగా వైరాలో గెలిచిన లావుడ్య రాములు నాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. మరోవైపు ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు సైతం మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌కు విధేయులుగా ఉండటంతోపాటు సమర్థులైన వారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. గతంలో కంటే మెరుగైన మంత్రివర్గం ఉండేలా ఎమ్మెల్యేల జాబితాను రూపొందిస్తున్నారు. 

స్పీకర్‌తోనే అన్ని... 
అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరు ఉంటారనేది స్పష్టత వస్తేనే మంత్రివర్గ కూర్పుపై ఒక అంచనా రానుంది. గత అసెంబ్లీలో స్పీకర్‌గా వ్యవహరించిన ఎస్‌. మధుసూదనచారి ఈసారి ఓడిపోవడంతో సీనియర్‌ ఎమ్మెల్యేలలో ఒకరిని స్పీకర్‌గా నియమించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఇందుకోసం పార్టీ విధేయులు పేర్లను పరిశీలిస్తున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌లలో ఒకరిని స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. స్పీకర్‌ పదవిని గతంలోలాగే బీసీ వర్గాలకు కేటాయిస్తే మంత్రివర్గం కూర్పులో మార్పులు జరగనున్నాయి. తొలిదశ విస్తరణ పరిమితంగానే ఉంటుందని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇప్పటికే స్పష్టత ఇచ్చినా అశావహుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.


 

మరిన్ని వార్తలు