26 Nov, 2018 16:00 IST|Sakshi

సాక్షి, మహబూబ్ నగర్ : ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరి.. టీఆర్‌ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తీరుపై టీఆర్‌ఎస్‌ సీనియర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన జితేందర్‌రెడ్డి.. కేకే సహా తనతోపాటు సీనియర్‌ ఎంపీలు టీఆర్‌ఎస్‌ను వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్న విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు.

ఆయన టీఆర్‌ఎస్‌ను వీడటానికి రియల్ ఎస్టెట్ వ్యాపారాలే కారణమని అన్నారు. రాజీనామాపత్రంలో కేసీఆర్‌ను  కీర్తించిన విశ్వేశ్వర్‌రెడ్డి.. ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారని, ఆయన తీరు దారుణమని మండిపడ్డారు. తాను, కేకే అసంతృప్తిగా ఉన్నామనటం అవాస్తవమని, పార్టీలో కేసీఆర్ తమకు సముచిత స్థానం ఇచ్చారని అన్నారు. ఇక, ఏ ఎంపీ కూడా టీఆర్ఎస్‌ను వీడబోరని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు  కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని చెప్పారు.

మరిన్ని వార్తలు