‘ప్రకటించని మేనిఫెస్టో కాపీ ఎలా సాధ్యం?’

18 Oct, 2018 05:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఇంకా ప్రకటించలేదని, అలాంటప్పుడు కాపీ కొట్టడం ఎలా జరుగుతుందని కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ ప్రశ్నించా రు. రైతుబంధు, రైతు బీమా కొనసాగిస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ నేతలు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెబితే ఇంకా బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ నేతలు ప్రజల మధ్య లేరు. అందుకే మేమే గెలుస్తామని చెబుతూ ఊహల్లో పయనిస్తున్నారు. అధికారం లేనప్పుడు ప్రజల్లో తిరిగే అలవాటు కాంగ్రెస్‌ నేతలకు లేదు. 2014 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాం. చెప్పనివీ చేశాం. అందుకే కేసీఆర్‌ను జనం నమ్ముతున్నారు. రూ.200 ఉన్న పింఛను కూడా ఇవ్వని కాంగ్రెస్‌.. రూ.2వేలు ఎలా ఇస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతలవి బక్వాస్‌ మాటలు. ఎన్నికలు వద్దని డీకే అరుణ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అంటే ఎన్నికలకు ఎవరు భయపడుతున్నారు? ప్రజాకోర్టులో తేల్చుకుందామని కేసీఆర్‌ సవాల్‌ విసిరితే సై అన్నారు. ఇప్పుడు ప్రజాకోర్టును చూసి భయపడి హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు‘ అని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు