దామాషా విస్మరించి తమాషా

13 Mar, 2018 02:46 IST|Sakshi
పార్లమెంట్‌ ద్వారం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న టీఆర్‌ఎస్‌ ఏంపీలు

     కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆగ్రహం

     బీసీ, ఎస్టీల జనాభా తగ్గి ఉంటే రిజర్వేషన్లు తగ్గించే వారు కాదా?

     జనాభా పెరిగినప్పుడు ఎందుకు పెంచరు?

     బీజేపీ వైఖరితో రిజర్వేషన్లకు ప్రమాదం

     దళిత, గిరిజన, బీసీ జాతులతో ఆడుకోవద్దని హెచ్చరిక

     పార్లమెంటు భవనం నాలుగో నంబర్‌ గేటు వద్ద ధర్నా  

సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వం తమాషా చేస్తోందంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు విరుచుకుపడ్డారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునేందుకు రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని, లేదంటే రాష్ట్రం తెచ్చిన రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అనుగుణంగా 9వ షెడ్యూలులో చేర్చాలని డిమాండ్‌ చేశారు. సోమవారం తొలుత లోక్‌సభలో స్పీకర్‌ పోడియం వద్ద టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టగా సభ వెంటనే వాయిదా పడింది. దీంతో పార్లమెంటు భవనం నాలుగో నంబర్‌ గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఎంపీలు ఎ.పి.జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బి.వినోద్‌కుమార్, ఎ.సీతారాం నాయక్, నగేశ్, పసునూరి దయాకర్, సి.హెచ్‌.మల్లారెడ్డి, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రాల్లో జనాభా దామాషా మేరకు రిజర్వేషన్లు ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ విభజన నాడే కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి పంపాం. దీన్ని తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలని కోరుతున్నాం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరున రిజర్వేషన్లపై నిర్ణయాలు ఉండరాదు. అన్ని రాష్ట్రాలకు ఒకే నీతి ఉండాలి. తమిళనాడులో 69 శాతం, మహారాష్ట్రలో 52 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. రాజస్తాన్, ఏపీలో కూడా వివిధ కులాలను చేర్చాలన్న డిమాండ్‌ ఉంది. కేంద్రం మొండిగా వ్యవహరించకుండా, అధికారాలను వారి వద్దే అంటిపెట్టుకోకుండా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకునేలా అధికారం ఇవ్వాలి’అని డిమాండ్‌ చేశారు. 

పెంచితే తప్పేంటి?: సీతారాం నాయక్‌ 
ఎంపీ సీతారాం నాయక్‌ మాట్లాడుతూ.. ‘కేంద్రం మా డిమాండ్‌పై స్పందించడం లేదు. మాది కొత్త రాష్ట్రం. విభజన జరిగిన నాడు తెలంగాణలో 6 శాతం ఎస్టీలు, 15 శాతం ఎస్సీలు ఉన్నారు. ఇప్పుడు జనాభా పెరిగిన మేరకు రిజర్వేషన్‌ పెంచాలి. రాష్ట్ర విభజన తర్వాత ఒకవేళ ఎస్సీల శాతం 5, ఎస్టీల శాతం 2 అయితే మీరు రిజర్వేషన్లు తగ్గించే వారు కాదా? ఎందుకు ఇంకా జాప్యం చేస్తున్నారు? దళిత, గిరిజన జాతులతో మీరు దోబూచులాడుతున్నారు. తమాషాగా అనిపిస్తోందా? ఎన్ని రోజులు ఇలా ఫుట్‌పాత్‌లపై పోరాడాలి. దీనికి మోదీ సమాధానం చెప్పాలి.

రిజర్వేషన్లు పెంచడంతో తప్పేముంది? జాతీయ పార్టీల చేతగానితనంపై ప్రాంతీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. జాతీయ పార్టీలకు పనితనం లేకనే ప్రాంతీయ పార్టీలు ముందుకొస్తున్నాయి. మమ్మల్ని ఇలా రోడ్లపై పెట్టి మా జాతులతో ఇంకెన్నాళ్లు ఆడుకుంటారు? మాకు ఉద్యమాలు కొత్త కాదు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వమే ఇక్కడికొచ్చి ఆందోళన చేపడుతుంది. ఎందుకు మీకు ఈ పెత్తనాలు. రాష్ట్రాలపై బతికేవాళ్లకు రాష్ట్రాలను అణిచివేయాలని చూడటం సరికాదు. మా ఫ్లోర్‌ లీడర్‌ను పిలిచి ఎందుకు మాట్లాడటం లేదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై మీకు చిత్తశుద్ధి లేదు. బీజేపీ తీరుతో రిజర్వేషన్ల వ్యవస్థకు ప్రమాదం ఉంది. బీజేపీ నాటకం ప్రజలకు అర్థమవుతుంది’అని తీవ్రంగా విమర్శించారు. ఎంపీ నగేశ్‌ మాట్లాడుతూ ‘జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లను అన్ని కులాలకు కల్పించాలని రాజ్యాంగం నిర్ధేశించింది. రాష్ట్రం ఏర్పడిన అనంతరం గిరిజన, బీసీ కులాల జనాభా పెరిగింది. ఆ ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల్లో పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు?’అని ప్రశ్నించారు.

తమిళనాడుకో న్యాయం మాకో న్యాయమా: కవిత 
ఎంపీ కవిత మాట్లాడుతూ ‘వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రధాన డిమాండ్‌ అయిన రిజర్వేషన్‌ కోటా పెంపుపై పోరాటం చేస్తున్నాం. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఓపిగ్గా నిరీక్షించిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఆందోళన చేస్తోంది. ఇకపైనా ఆందోళన కొనసాగిస్తాం. పెరిగిన జనాభాకు అనుగుణంగా బీసీలు, ఎస్టీల రిజర్వేషన్ల కోటా పెంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తూ 9వ షెడ్యూలులో చేర్చాలి. లేదంటే సుప్రీంకోర్టుకైనా వెళ్లి రిజర్వేషన్లు సాధించుకుంటాం. సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి చెప్పినా అక్కడే ప్రత్యామ్నాయం కూడా చూపింది. తమిళనాడులో రిజర్వేషన్లు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలుసు. వారికో న్యాయం మాకో న్యాయం సరికాదు. తెలంగాణ కూడా ఈ దేశంలోని రాష్ట్రమే. కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలి’అని కోరారు.

మరిన్ని వార్తలు