ఘనంగా టీఆర్‌ఎస్‌ ఎంపీల ప్రమాణ స్వీకారం

5 Apr, 2018 02:21 IST|Sakshi
బుధవారం రాజ్యసభలో ఎంపీలుగా ప్రమాణం చేస్తున్న సంతోష్‌కుమార్, లింగయ్య యాదవ్,బండా ప్రకాశ్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ముగ్గురు టీఆర్‌ఎస్‌ నేతల ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్, నల్లగొండ జిల్లా నేత బడుగుల లింగయ్యయాదవ్, వరంగల్లు జిల్లాకు చెందిన డాక్టర్‌ బండ ప్రకాశ్‌ముదిరాజ్‌ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురు సభ్యులు మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఎంపీ సంతోష్‌కుమార్‌ ముందు వరుసలో ఉన్న అధికార, ప్రతిపక్ష నేతలందరికీ నమస్కరించారు. పలువురు సీనియర్‌ ఎంపీలు సంతోష్‌కుమార్‌ వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీమణి కల్వకుంట్ల శోభ, ఎంపీ కె.కవిత ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

లోక్‌సభ సభ్యులంతా నూతన ఎంపీలను అభినందించారు. స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వచ్చి నూతన ఎంపీలను అభినందించారు. వీరితోపాటు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లారు.  బలహీన వర్గాలకు చెందిన తమకు రాజ్యసభ సభ్యులుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవకాశం కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు పేర్కొన్నారు. అనంతరం సంతోష్‌కుమార్, లింగయ్యయాదవ్, బండ ప్రకాశ్‌లు ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లతో కలసి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తులు, ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చారు. 

మరిన్ని వార్తలు