టీఆర్‌ఎస్‌కు ‘ఎక్స్‌అఫీషియో’ బలం!

15 Jan, 2020 02:43 IST|Sakshi

చైర్‌పర్సన్, మేయర్‌ ఎన్నికల్లో ‘ఎక్స్‌అఫీషియో’ ఓట్లు కీలకం

నిర్ణయాత్మకం కానున్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఓట్లు

టీఆర్‌ఎస్‌ వద్ద 148, కాంగ్రెస్, ఎంఐఎం వద్ద చెరో 10, బీజేపీ వద్ద 6 ఓట్లు

టీఆర్‌ఎస్‌కు కలసి రానున్న సంఖ్యాబలం 

సాక్షి, హైదరాబాద్‌: చైర్‌పర్సన్‌/మేయర్, వైస్‌చైర్‌పర్సన్‌/డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో ‘ఎక్స్‌ అఫీషియో’సభ్యులుగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చక్రం తిప్పబోతున్నారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కలిగి ఉన్న అధికార పార్టీ మున్సిపల్‌ ఎన్నికల్లో జాక్‌పాట్‌ కొట్టబోతోంది. మెజారిటీకి ఒక్క ఓటు తక్కువ ఉన్నా ఎక్స్‌అఫీషియో ఓటుతో కీలకమైన చైర్‌పర్సన్‌/మేయర్, వైస్‌చైర్‌పర్సన్‌/డిప్యూటీ మేయర్ల పదవులను కైవసం చేసుకోబోతోంది.

మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్లు/కార్పొరేటర్లుగా గెలిచిన సభ్యులు తమరిలో ఒకరిని చైర్‌పర్సన్‌/మేయర్‌గా, మరొకరిని వైస్‌చైర్‌పర్సన్‌/ డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకోనున్నారు. పురపాలికలకు సాధారణ ఎన్నికలు ముగిసిన అనంతరం నిర్వహించే తొలి సర్వసభ్య సమావేశంలోనే చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్‌/ మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులు సైతం ఈ సమావేశంలో పాల్గొని ఓటేయనున్నారు. మూజువాణి ఓటింగ్‌ ద్వారా ఎన్నికల్లో పార్టీ విప్‌ మేరకు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏదైనా కారణంతో తొలి సర్వసభ్య సమావేశం జరిగిన రోజు ఎన్నికలు నిర్వహించలేకపోతే మరుసటి రోజు నిర్వహించనున్నారు.

ఒకే చోట ఎక్స్‌అఫీషియో  
తమ శాసనసభ/లోక్‌సభ/శాసన మండలి నియోజకవర్గం పరిధిలో ఏదైనా పురపాలిక ఉన్నా, లేదా దానిలోని కొంతభాగం ఉన్నా, సదరు పురపాలిక పాలకమండలిలో స్థానిక ఎమ్మెల్యే/ఎంపీ/ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నియమితులుకానున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో ఒకటి కంటే అధిక సంఖ్యలో పురపాలికలు ఉంటే, సదరు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఇష్టం ప్రకారం వాటిలో ఏదేని ఒక పురపాలికలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా చేరాల్సి ఉంటుంది.

ఎంపీ, ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత లేదా పురపాలికలకు సాధారణ ఎన్నికలు జరిగిన 30 రోజుల్లోగా సంబంధిత మున్సిపాలిటీ కమిషనర్‌కు రాతపూర్వకంగా తెలియజేస్తే ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నియమించనున్నారు. స్థానిక సంస్థల, ఎమ్మెల్యే కోటా, పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్‌ నామినేట్‌ చేసిన ఎమ్మెల్సీలు సైతం తమ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా ఒక పురపాలికలో ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నియమితులు కానున్నారు.

టీఆర్‌ఎస్‌కు కీలకం 
మేయర్‌/చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్‌/వైస్‌చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకు ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్ల వర్షం పడనుంది. నామినేటెడ్‌ సభ్యుడితో కలిసి రాష్ట్ర శాసనసభలో 120 సీట్లు ఉండగా, 105 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు చెందినవారే కావడం గమనార్హం. ఇక ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్‌కు 6 మంది, టీడీపీ, బీజేపీలకు చెరొక ఎమ్మెల్యే ఉన్నారు. శాసనమండలిలో మొత్తం 40 స్థానాలుండగా, ఒక స్థానం ఖాళీగా ఉంది.

మండలిలో టీఆర్‌ఎస్‌కు 34 మంది సభ్యులుండగా, ఎంఐఎంకు ఇద్దరు, బీజేపీ, కాంగ్రెస్‌కు చెరొకరు ఉన్నారు. యూటీఎఫ్‌ తరఫున గెలిచిన నర్సారెడ్డి మండలిలో పార్టీకి ప్రాతినిధ్యం వహించడం లేదు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలుండగా, టీఆర్‌ఎస్‌కు 9 మంది, బీజేపీకి నలుగురు, కాంగ్రెస్‌కు ముగ్గురు, ఎంఐఎంకు ఒక ఎంపీ ఉన్నారు. పార్టీల వారీగా మొత్తం ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లను పరిశీలిస్తే..టీఆర్‌ఎస్‌ వద్ద 148, కాంగ్రెస్, ఎంఐఎం దగ్గర చెరో 10, బీజేపీ వద్ద 6, టీడీపీ వద్ద ఒక ఓటు ఉంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా