టార్గెట్‌ బీజేపీ షురూ !

9 Jul, 2019 10:52 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో పట్టణాలపై గులాబీ జెండాను మరోసారి ఎగురేయాలని భావిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని కలలుగంటున్న బీజేపీని నిలువరించేందుకు గులాబీ నేతలు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చి పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించడంతోపాటు 2023లో జరిగే శాసనసభ ఎన్నికలే టార్గెట్‌గా ముందుకు సాగాలని పార్టీ యంత్రాంగానికి దిశానిర్ధేశం చేశారు.

అమిత్‌షా ఇచ్చిన స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌పై కమలదళం గొంతు పెంచింది. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కంచుకోట వంటి కరీంనగర్, నిజామాబాద్‌తోపాటు ఆదిలాబాద్, సికింద్రాబాద్‌ సీట్లు గెలుచుకొని ఊపు మీదున్న బీజేపీ పట్టణాలపై పట్టు బిగించాలని భావిస్తోంది. బీజేపీకి క్షేత్రస్థాయిలో సానుభూతిపరులే తప్ప బలమైన యంత్రాంగం లేదు. ఆ పార్టీ బలపడేలోపే మునిసిపల్‌ ఎన్నికలు ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయినా బీజేపీని తేలిగ్గా తీసుకోకుండా, బలపడేలోపే దెబ్బ కొట్టాలనే యోచనతో గులాబీదళం పావులు కదుపుతోంది. బీజేపీకి తెలంగాణలో ఏమాత్రం బలం లేదనే మైండ్‌గేమ్‌ ప్రారంభించిన ఆ పార్టీ నాయకులు మునిసిపల్‌ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావనే ప్రచారానికి తెరలేపారు. 

పార్లమెంటు ఫలితాలు పునరావృతం కాకుండా..
పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ధీమా టీఆర్‌ఎస్‌ కొంప ముంచింది. మోదీ హవాను తక్కువగా అంచనా వేయడం, బీజేపీకి గ్రామాల్లో ఓట్లు లేవనే అతి నమ్మకం, సంజయ్‌ పట్ల పెరిగిన సానుభూతిని గుర్తించపోవడంతో సిట్టింగ్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ సుమారు 90వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. పట్టణ ఓటర్లతోపాటు గ్రామీణ ఓటర్లు కూడా గత ఎన్నికల్లో సంజయ్‌కు అండగా నిలిచారు. మునిసిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే విషయంలో స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే మైండ్‌గేమ్‌తో బీజేపీకి చెక్‌ పెట్టేలా ప్రణాళికలు రూపొందించారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ మీడియా సమావేశాల్లో, బహిరంగసభల్లో విమర్శలు చేసేలా ప్లాన్‌ అమలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.టి.రామారావు ఇప్పటికే బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తూర్పార పట్టగా, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ సోమవారం మీడియా సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తీరును ఎండగట్టారు. హోంమంత్రిగా ఉండి వీధిపోరాటాలు చేయాలని పిలుపునివ్వడం, హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నిస్తూనే తెలంగాణ రాష్ట్రాన్నే శాంతిమార్గంలో తీసుకొచ్చిన టీఆర్‌ఎస్‌కు, జనాలను రెచ్చగొట్టే బీజేపీకి గల వ్యత్యాసం ఇదని చురకలు అంటించారు. 

స్మార్ట్‌ సిటీ ఘనత టీఆర్‌ఎస్‌దేనంటూ...
కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని ప్రచారం ఇప్పటికే ప్రారంభించారు. స్మార్ట్‌సిటీ ఇచ్చింది తామేనని బీజేపీ చెబుతున్న మాటలను తిప్పికొడుతూ కేసీఆర్‌ సూచనల మేరకు తాము చేసిన ప్రతిపాదనల వల్లనే కేంద్రం కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా గుర్తించిందని ప్రచారం చేస్తున్నారు. స్మార్ట్‌సిటీకి నిధులు కూడా విడుదల చేయని విషయాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు జనం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. పట్టణాల అభివృద్ధి తమతోనే సాధ్యమని, కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెబుతున్న బీజేపీని ఐదేళ్లలో చేసిందేంటనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సన్నద్ధమయ్యారు. తామిచ్చిన ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లేదని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ జాబితాను చదివి వినిపించారు. 

ఇతర మునిసిపాలిటీల్లో సైతం..
కరీంనగర్‌తోపాటు రామగుండం కార్పొరేషన్‌లో కూడా బీజేపీని ఎదగకుండా మొగ్గ స్థాయిలోనే తుంచేయాలనే పకడ్బందీ ప్రణాళిక టీఆర్‌ఎస్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇక్కడ బీజేపీ ప్రస్తావన కూడా తీయకుండా టీఆర్‌ఎస్‌ వల్లనే సింగరేణి, రామగుండం అభివృద్ధి సాధ్యమైందనే ప్రచారం ప్రారంభించారు. గత పాలకమండలి అవినీతి ఆరోపణలు, మేయర్‌ మార్పు, టీఆర్‌ఎస్‌లో లుకలుకలు తదితర అంశాలన్నీ పలు డివిజన్లలో సిట్టింగ్‌ కార్పొరేటర్లకు ప్రతికూలంగా మారాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ గురించి ఆలోచించకుండా గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి హుజూరాబాద్, జమ్మికుంటల్లో కమలంకు బలం తెస్తానని చెబుతున్నా, ఈటలను తట్టుకోవడం కష్టమేనని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో బీజేపీకి బలం ఉన్నప్పటికీ, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి విషయంలో టీఆర్‌ఎస్‌కు పెద్దగా అంచనాలు లేవు. చొప్పదండిలో గెలుపును మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు.

సిరిసిల్ల, వేములవాడల్లో కేటీఆర్‌ ప్రభావం పనిచేస్తుందని, ఇక్కడ బీజేపీకి గెలుపు సీన్‌ లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లోని మునిసిపాలిటీలలో బీజేపీ ప్రభావం కనిపించకుండా స్థానిక ఎమ్మెల్యేలు సమాయత్తమవుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా టీఆర్‌ఎస్‌ పకడ్బందీ వ్యూహంతో బల్దియా పోరుకు సిద్ధమవుతోంది.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా