కారుదే విజయం

4 Jun, 2019 13:03 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ఆయన గెలుపు లాంఛనమేనని భావిస్తుండగా.. మొత్తం ఓట్లలో ఆయనకు 883 దక్కాయి. దీంతో 825 ఓట్ల భారీ మెజార్టీతో శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డికి కేవలం 23 ఓట్లు రాగా, ఘోర పరాజయం పొందారు.ఏనుమాములలో లెక్కింపుఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌ గోదాంలో ప్రారంభమైంది. కౌంటింగ్‌కు మూడు టేబుళ్లను ఏర్పాటు చేసి అభ్యర్థుల వారీగా ఓట్లు విభజించి లెక్కించారు. మొత్తం 902 ఓట్లకు 883 పోల్‌ కాగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి 848, కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డికి 23 మాత్రమే వచ్చాయి. ఇక 12 ఓట్లు చెల్లలేదు. స్వతంత్రులుగా ఎమ్మెల్సీ బరిలో నిలిచిన తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, అన్నారపు యాకయ్య, రంగరాజు రవీందర్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. కాంగ్రెస్‌ నాయకుడు, ఖానాపూర్‌ ఎంపీపీ రవీందర్‌రావు తన ఓటు తాను సైతం వేసుకోలేదు.
 
ఏకపక్షంగా పోలింగ్‌
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 902 మంది ఓటర్లు ఉండగా... 883 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, ఆజ్మీరా సీతారాం నాయక్‌ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్స్‌అఫిషీయో కోటాలో వారు ఓటేయలేదు. మరో 17 మంది కూడా వివి ధ కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 12 మంది ఎక్స్‌అఫీషీయో సభ్యులు, 871 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ నాటికి ఎన్నికల సంఘం సమాచారం మేరకు ఎక్స్‌అఫిషీ యో సభ్యులు కలుపుకుని 680 మంది టీఆర్‌ఎస్, 169 మంది కాంగ్రెస్‌ మద్దతుదారులు ఉండగా, 53 మంది స్వతంత్రులు ఉన్నట్లు తేలింది.

ఇందులో మెజార్టీ ఓట్లను సాధించేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహరచన చేసి సక్సెస్‌ అయ్యింది. మూడు టేబుళ్ల ద్వారా ఓట్లను లెక్కించగా, మొదటి టేబుల్‌లో 300 ఓట్లకు గాను టీఆర్‌ఎస్‌ 292, కాంగ్రెస్‌కు ఆరు ఓట్లు రాగా, రెండు ఓట్లు చెల్లలేదు. రెండో టేబుల్‌లో 300 ఓట్లకు టీఆర్‌ఎస్‌కు 285, కాంగ్రెస్‌కు 11 ఓట్లు రాగా, నాలుగు ఓట్లు చెల్లలేదు. మూడో టేబుల్‌లో మొత్తం 283 ఓట్లను లెక్కించగా 271 టీఆర్‌ఎస్‌కు, ఆరు కాంగ్రెస్‌కు రాగా 6 ఓట్లు చెల్లని ఖాతాలో పడ్డాయి. టీఆర్‌ఎస్‌ ఉన్న 680 ఓట్లకు తోడు 53 మంది స్వతంత్రులు, 115 మంది కాంగ్రెస్‌ ఓటర్ల మద్దతును కూడగట్టారు. దీంతో పోలైన 883 ఓట్లలో 12 చెల్లకుండా పోగా,  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కేవలం 23 ఓట్లే వచ్చాయి. ఈ లెక్కన అత్యధికంగా కాంగ్రెస్‌ మద్దతుదారులు, స్వతంత్రులు కూడా టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గు చూపినట్లు తేలింది.

ఒక్క ఓటు దక్కించుకోలేని స్వతంత్రులు
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా పోటీలో నిలిచిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులకు ఒక్క ఓటు కూడా రాలేదు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి(టీఆర్‌ఎస్‌), ఇనుగాల వెంకట్రాంరెడ్డి (కాంగ్రెస్‌)తో పాటు స్వతంత్రులుగా తక్కళ్లపెల్లి రవీందర్‌ రావు, అన్నారపు యాకయ్య, రంగరాజు రవీందర్‌ పోటీలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో ముగ్గురికీ ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ ముగ్గురు బరిలో ఉండటం కోసం కొందరు ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు ప్రతిపాదించగా, వారు సైతం ఓటేయలేదు. కాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఖానాపూర్‌ ఎంపీపీగా ఉన్న తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తన ఓటును తనకు కూడా వేసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ ఖాతాలో 169 మంది ఉన్నప్పటికీ ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 23 ఓట్లు రావడాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.

అధికారుల పర్యవేక్షణ
ఎన్నికల సంఘం నియమించిన అనిత రాజేంద్రన్‌ పర్యవేక్షణలో కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులు, ఎన్నికల ఎజెంట్ల సమక్షంలో వీడియో రికార్డింగ్‌ ద్వారా ఓట్లు లెక్కించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జె.పాటిల్, శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఎస్‌.దయానంద్‌ లెక్కింపును పరిశీలించారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఎమ్మెల్సీగా గెలుపొందిన పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డికి అధికారులు ధృవీకరణ పత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు