గ్రేటర్‌లో పొలిటికల్‌ హీట్‌

7 Sep, 2018 08:32 IST|Sakshi

అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌

ఫస్ట్‌ లిస్ట్‌లోనే తాజా మాజీలకు ఛాన్స్‌

గతంలో ఓడిన అభ్యర్థులకు మరో అవకాశం  

ఎనిమిది స్థానాలపై ఊగిసలాట

‘సరిజోడీ’ల ఎంపికలో విపక్షాలు  

ఐదు సార్లు సైకిల్‌ ఎక్కిన తలసాని, సాయన్న..ఆరోసారి కారుపై రైడ్‌  

నాయిని నారాజ్‌..మేయర్‌కు ఆశాభంగం

‘ముందస్తు’పై ప్రజల అసహనం..

అసెంబ్లీ రద్దు సరికాదని అభిప్రాయం

ఎన్నికలకు కారు జోరందుకుంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల గులాబీ గ్యాంగ్‌ తొలి జాబితా విడుదలైంది.  గురువారం మధ్యాహ్నం శాసనసభనురద్దు చేసిన అనంతరం సీఎం కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు.చాలామంది సిట్టింగ్‌లతో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి   అభ్యర్థులకూ ఆయన అవకాశమిచ్చారు.    

సాక్షి,సిటీబ్యూరో: శాసనసభ రద్దుతో పాటు ఏకంగా అభ్యర్థులను సైతం ప్రకటించి అధికార టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికల రణానికి తెర తీయడంతో నగరంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. తొలి జాబితాలోనే తాజా మాజీ ఎమ్మెల్యేలతో పాటు (మల్కాజిగిరి మినహా) గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులకూ మరో అవకాశం కల్పించారు. చివరి నిమిషంలో మల్కాజిగిరి, ముషీరాబాద్‌ స్థానాల అభ్యర్థుల ప్రకటన నిలిపివేత, బీజేపీ, ఎంఐఎం సిట్టింగ్‌ స్థానాల్లో మెజారిటీ ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడం రాజకీయ చర్చకు తెరలేపింది. టీఆర్‌ఎస్‌ తొలి జాబితా ప్రకటించడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్, జన సమితి సైతం తమ కార్యాచరణను ముమ్మరం చేశాయి.  

సిట్టింగ్‌లందరికీ సీటు ఖరారు
టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లిన తలసాని శ్రీనివాసయాదవ్‌ (సనత్‌నగర్‌), మాగంటి గోపీనాథ్‌ (జూబ్లీహిల్స్‌), ఎం.కృష్ణారావు(కూకట్‌పల్లి), ఎ.గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాష్‌గౌడ్‌(రాజేంద్రనగర్‌), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), సాయన్న (కంటోన్మెంట్‌), కె.పి. వివేకానంద్‌ (కుత్బుల్లాపూర్‌) వంటి వారందరికీ టీఆర్‌ఎస్‌ టికెట్లు ఖరారు చేసింది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌పై విజయం సాధించిన మల్కాజిగిరి తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి పేరు లేకపోగా,   టి.పద్మారావు (సికింద్రాబాద్‌)లకు మరో అవకాశం ఇచ్చారు. మల్కాజిగిరిలో కనకారెడ్డి కోడలు విజయశాంతి పేరు దాదాపు ఖాయమైన తర్వాత, చివరి నిమిషంలో తొలగించినట్లు సమాచారం. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ పేరు సైతం ఖరారు కాగా, హోంమంత్రి నాయిని ఫిర్యాదుతో అధికారిక ప్రకటన వాయిదా వేసినట్లు తెలిసింది.

సనత్‌నగర్‌– తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
పేరు: తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
విద్యార్హత: ఇంటర్మీడియెట్‌
కుటుంబం: భార్య స్వర్ణ, కుమార్తెలు శ్వేత, స్వాతి, కుమారుడు సాయికిరణ్‌
స్వస్థలం: ఆదయ్యనగర్, సికింద్రాబాద్‌
రాజకీయ నేపథ్యం: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న ఆయన సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు పోటీ చేశారు. 1994, 1999, 2008, (ఉప ఎన్నిక)ల్లో సికింద్రాబాద్‌ నుంచి, 2014 సనత్‌నగర్‌ నుంచి సైకిల్‌ గుర్తుపై గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 1994లో కార్మిక శాఖ మంత్రిగా, 1999లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నగర అధ్యక్షునిగా పనిచేసిన ఆయన 2014 ఎన్నికల్లో సనత్‌నగర్‌ నుంచి గెలుపొందారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు.

సికింద్రాబాద్‌– టి.పద్మారావు గౌడ్‌
పేరు: తీగుళ్ల పద్మారావు గౌడ్‌
విద్యార్హత: ఇంటర్‌
కుటుంబం: భార్య స్వరూప, కుమారులు కిషోర్, కిరణ్, రామేశ్వర్, త్రినేత్ర, కుమార్తెలు మనీష, మౌనిక
రాజకీయ నేపథ్యం: 1973లో యువజన కాంగ్రెస్‌లో చేరిక. 1986లో హిస్సాంగంజ్‌ మోండా డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2002లో టీఆర్‌ఎస్‌ నుంచి మరోసారి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా గెలుపొందారు. 2004లో సికింద్రాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 సికింద్రాబాద్‌ ఉప ఎన్నికల్లో తలసాని
చేతిలో, 2009తో సనత్‌నగర్‌ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మారావు గౌడ్‌
రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు.

బహదూర్‌పురా– మీర్‌ ఇనాయత్‌ అలీ బాక్రీ
పేరు: మీర్‌ ఇనాయత్‌ అలీ బాక్రీ  
విద్యార్హత: బీఏ  
కుటుంబం: భార్య పర్వీన్, కుమార్తెలు నిఖత్, జబీన్, కుమారుడు రిజ్వాన్‌ అలీ బాక్రీ  
స్వస్థలం : దారుషిఫా, హైదరాబాద్‌  
రాజకీయ నేపథ్యం: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఆ పార్టీ చార్మినార్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో చార్మినార్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌  అభ్యర్థిగా పోటీ చేశారు.    
నిర్వహించిన పదవులు: సెట్విన్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆయన నేషనల్‌ హ్యాకర్స్‌ ఫెడరేషన్, ఏపీ హమాలీ అండ్‌ ట్రాన్స్‌ఫోర్టు వర్కర్స్‌ యూనియన్, ఏపీ మహిళా వెల్ఫేర్‌ సొసైటీ, భారత్‌ వెల్ఫేర్‌ సొసైటీ, తెలంగాణ ఉర్దూ తహరీఖ్, తెలంగాణ లేబర్‌ అసోసియేషన్‌లను కొనసాగుతున్నారు. 

చాంద్రాయణగుట్ట– ముప్పిడి సీతారాంరెడ్డి
పేరు : ముప్పిడి సీతారాంరెడ్డి
విద్యార్హత : బీఏ  
కుటుంబం : భార్య శోభారెడ్డి, కుమార్తె గ్రీష్మారెడ్డి
స్వస్థలం : ఎస్సార్టీ కాలనీ, ఛత్రినాక, హైదరాబాద్‌  
రాజకీయ నేపథ్యం: 2001 నుంచి టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి క్రియాశీలక నాయకుడిగా కొనసాగుతున్నారు. 2002లో గౌలిపురా డివిజన్‌ నుంచి, 2016లో జంగమ్మెట్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  2014 ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. 2001లో ఆదిలాబాద్‌ జిల్లా జెడ్పీటీసీ ఇన్‌చార్జిగా కొనసాగారు.   

ఎల్‌బీనగర్‌– రాంమోహన్‌ గౌడ్‌
పేరు: ముద్దగౌని రాంమోహన్‌గౌడ్‌
విద్యార్హత: బీకాం డిగ్రీ
కుటుంబం: భార్య లక్ష్మీప్రసన్న (పస్తుతం బీఎన్‌రెడ్డినగర్‌ కార్పొరేటర్‌)
కుమారులు: రంజిత్‌గౌడ్, మనీష్‌గౌడ్‌
స్వస్థలం: సాహెబ్‌నగర్, వైదేహినగర్, బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌
రాజకీయ నేపథ్యం: టీఆర్‌ఎస్‌లో చేరకముందు కాంగ్రెస్‌లో 30 ఏళ్లపాటు ఉన్నారు. ఎల్‌బీనగర్‌ టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీ ఎల్‌బీనగర్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
చేపట్టిన పదవులు: 2007లో హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా.. 2011లో తిరిగి రెండోసారి హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా పదవులు నిర్వహించారు. ప్రస్తుతం ఎల్‌బీనగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

కార్వాన్‌–  ఠాకూర్‌ జీవన్‌సింగ్‌
పేరు: ఠాకూర్‌ జీవన్‌సింగ్‌  
విద్యార్హత: ఇంటర్మీడియెట్‌  
కుటుంబం: భార్య దీపారాణి, కుమారుడు శశిధర్,
కుమార్తెలు నిషిత, నిహారిక  
స్వస్థలం: మహబూబ్‌నగర్‌జిల్లా మొగిలిగిద్దె  
రాజకీయ నేపథ్యం: 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కార్వాన్‌  నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కార్వాన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

మహేశ్వరం– తీగల కృష్ణారెడ్డి
పేరు: తీగల కృష్ణారెడ్డి
విద్యార్హత: బీఏ
కుటుంబ నేపథ్యం: భార్య తీగల అరుంధతి  
కుమారులు: తీగల హరినాథ్‌ రెడ్డి, తీగల అమర్‌నాథ్‌  
కుమార్తె: తీగల హరితారెడ్డి
స్వస్థలం: రంగారెడ్డి జిల్లా, బాలాపూర్‌ మండలం, పాత మీర్‌పేట్‌   
చేపట్టిన పదవులు: 1987–89, 1995–98లలో హుడా చైర్మన్‌ (హైద్రాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)గా, 2001– 2006లో హైదరాబాద్‌ మేయర్‌గా పని చేశారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు.   

పటాన్‌చెరు– మహిపాల్‌రెడ్డి
పేరు: గూడెం మహిపాల్‌రెడ్డి  
విద్యార్హత: ఇంటర్మీడియెట్‌   
స్వస్థలం: పటాన్‌చెరు
కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె   
రాజకీయ నేపథ్యం : 1996–99 వరకు పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా  పనిచేశారు. 2001–2002 వరకు కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2001లో పటాన్‌చెరు మండల అధ్యక్షుడిగా ఎన్నిక. 2005 వరకు మండల అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. పలు పరిశ్రమల్లో కార్మిక యూనియన్‌ నేతగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో బీఎస్పీ టికెట్‌తో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. 2013లో వైఎస్సార్‌ సీపీలో చేరారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

నాంపల్లి– మునుకుంట్ల ఆనంద్‌కుమార్‌ గౌడ్‌
పేరు: మునుకుంట్ల ఆనంద్‌కుమార్‌ గౌడ్‌
విద్యార్హత: బీఏ
స్వస్థలం: గౌలిగూడ, హైదరాబాద్‌
కుటుంబం: భార్య మంజుల, కుమారులు వైష్ణవ్‌ గౌడ్, అభినవ్‌గౌడ్‌
రాజకీయ నేపథ్యం: 1983లో రాజకీయ రంగ అరంగేట్రం. 2009 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సుల్తాన్‌బజార్‌ డివిజన్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా, 2014 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జాంబాగ్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.   

జూబ్లీహిల్స్‌– మాగంటి గోపీనాథ్‌
పేరు: మాగంటి గోపీనాథ్‌
విద్యార్హత: బీఏ
కుటుంబం: భార్య మాగంటి సునీత, పిల్లలు మాగంటి వాత్సల్యనాథ్, అక్షర, దీక్షర
నివాసం: హైదరాబాద్‌
రాజకీయ నేపథ్యం: మూడు దశాబ్దాలపాటు తెలుగు «యువత
విభాగంలో ముఖ్యనేతగా,  టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశారు. 2014  ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 

ఉప్పల్‌– భేతి సుభాష్‌రెడ్డి
పేరు: భేతి సుభాష్‌రెడ్డి  
విద్యార్హత: బీకాం
కుటుంబం: భార్య భేతి స్వప్నరెడ్డి (జీహెచ్‌ఎంసీ హబ్సిగూడ కార్పొరేటర్‌), కుమారుడు, కుమార్తె ఉన్నారు.  
స్వస్థలం: రామాజీపేట, యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి జిల్లా
ప్రస్తుత నివాసం: రవీంద్రనగర్‌ కాలనీ, హబ్సిగూడ, ఉప్పల్‌  
రాజకీయ నేపథ్యం: ఇంటర్మీడియట్‌లో ఉండగా ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేశారు. డిగ్రీలో ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాడారు. టీఆర్‌ఎస్‌లో రాష్ట్ర యూత్‌ ప్రధాన కార్యదర్శిగా, జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.  
2009 నుంచి టీఆర్‌ఎస్‌ ఉప్పల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేస్తున్నారు.  
2014లో ఉప్పల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.     

కూకట్‌పల్లి– మాధవరం కృష్ణారావు
పేరు: మాధవరం కృష్ణారావు  
కుటుంబం: మాధవరం లక్ష్మీబాయి, కుమార్తె శ్రీలత, కుమారుడు సందీప్‌  
స్వస్థలం : శేషాద్రినగర్, కూకట్‌పల్లి  
రాజకీయ నేపథ్యం: 1983 నుంచి 30 ఏళ్లపాటు టీడీపీలో పనిచేశారు. మూడుసార్లు కూకట్‌పల్లి పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 2000 సంవత్సరంలో టీడీపీ కౌన్సిలర్‌గా గెలుపొంది కూకట్‌పల్లి మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు.

యాఖుత్‌పుర– సామ సుందర్‌రెడ్డి
పేరు: సామ సుందర్‌రెడ్డి
విద్యార్హత: డిగ్రీ  
స్వస్థలం: చంపాపేట, కేశవనగర్‌ కాలనీ
కుటుంబం: భార్య సామ స్వప్నారెడ్డి (ఐఎస్‌సదన్‌ డివిజన్‌ కార్పొరేటర్‌), కుమారుడు చరణ్‌రెడ్డి
రాజకీయ నేపథ్యం: బీజేపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా పని చేశారు. 2009లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  బీజేపీ నుంచి ఐఎస్‌సదన్‌ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యరు. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయన  భార్య సామ స్వప్నారెడ్డి కార్పొరేటర్‌గా గెలుపొందారు.  

కుత్బుల్లాపూర్‌– కె.పి. వివేకానంద్‌
పేరు: కె.పి.వివేకానంద్‌
విద్యార్హత: బీఈ   
కుటుంబం: భార్య సౌజన్య, కుమార్తె మాతృశ్రీ, కుమారుడు విధాత్‌ వర్ధంత్‌
స్వస్థలం: మేడ్చల్‌ జిల్లా, కుత్బుల్లాపూర్‌  
రాజకీయ నేపథ్యం: తండ్రి కేఎం పాండు 25 ఏళ్ల పాటు కుత్బుల్లాపూర్‌ సర్పంచ్‌గా, ఐదేళ్లు కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేశారు. పాండుకు ఏకైక కుమారుడు కేపీ వివేకానంద్‌
నిర్వహించిన పదవులు: శక్తి యువసేన సమితి ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
వివేకానంద్‌ 2008లో టీడీపీలో చేరారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ యువజన విభాగం
అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా
గెలిచి 2016లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీలో ప్రొటోకాల్‌ విభాగం సభ్యుడిగా
కొనసాగారు.  

శేరిలింగంపల్లి–  ఆరెకపూడి గాంధీ
పేరు: ఆరెకపూడి గాంధీ
విద్యార్హత: పాలిటెక్నిక్‌ డిప్లొమా
నివాసం: వివేకానందనగర్‌ కాలనీ, కూకట్‌పల్లి
కుటుంబం: భార్య శ్యామల, కుమారుడు పృథ్వీ, కూతురు ప్రణీత
స్వస్థలం: పాలకొండ, నందివాడ మండలం,కృష్ణా జిల్లా
రాజకీయ నేపథ్యం: 1982 టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌ అభిమాన సంఘం ప్రతినిధిగా ఉన్నారు. బసవతారకం ట్రస్టీగా పని చేశారు. డిచ్‌పల్లి, నిజామాబాద్‌ లోక్‌ సభ, ఖైరతాబాద్, గుడివాడ, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జిగా పని చేశారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.   

కంటోన్మెంట్‌– సాయన్న
పేరు: జ్ఞాని సాయన్న
విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ
కుటుంబం: భార్య గీత, కుమార్తెలు నమృత, నివేదిత, లాస్య నందిత (కవాడీగూడ కార్పొరేటర్‌)
స్వస్థలం: వాల్వాపూర్, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా
రాజకీయ నేపథ్యం: 1980లో బ్యాంకు ఉద్యోగిగా చేరిన సాయన్న, 1986లో హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో కవాడీగూడ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో తొలిసారిగా 1994లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి వరుసగా ఇక్కడే పోటీ చేస్తున్నారు. 2015లో కొంతకాలం టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేసిన సాయన్న, 2015లో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఇబ్రహీంపట్నం– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
పేరు: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి  
విద్యార్హత: బీఏ
స్వగ్రామం: ఎల్మినేడు, ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా  
సంతానం: కుమారులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి (మాజీ కార్పొరేటర్‌),  వెంకటేశ్వర్‌రెడ్డి, కూతురు శీతల్‌.  
రాజకీయ నేపథ్యం: 1986లోఎల్మినేడు సర్పంచ్‌గా పని చేశారు. 1992లో సింగిల్‌విండో చైర్మన్‌గా, డీసీసీబీ డైరెక్టర్‌గా, టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శిగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2002లో ఏపీఐడీసీ చైర్మన్‌గా పనిచేశారు. 2004లో టీడీపీ నుంచి మలక్‌పేట్‌ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2009– 2014లలో రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015లో టీఆర్‌ఎస్‌లో చేరారు.  

రాజేంద్రనగర్‌– టి.ప్రకాష్‌గౌడ్‌ 
పేరు: తొలుకట్ట ప్రకాష్‌గౌడ్‌
స్వస్థలం:మైలార్‌దేవ్‌పల్లి గ్రామం
విద్యార్హత:  ఎస్సెస్సీ  
నివాసం:  మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్‌ సర్కిల్,రంగారెడ్డి జిల్లా  
రాజకీయ నేపథ్యం: 2009 ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్‌ అభ్యర్థి బి.జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌పై గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యే మళ్లీ విజయం సాధించారు. 2016లో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. 

మరిన్ని వార్తలు