టీఆర్‌ఎస్‌ ఒక ప్రొప్రయిటర్‌ కంపెనీ

26 Nov, 2018 02:23 IST|Sakshi
ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి  

జితేందర్‌రెడ్డి, కేకేలు అసంతృప్తితో ఉన్నారు

వ్యక్తిగతంగా కూడా నన్ను అటాక్‌ చేశారు

కాంగ్రెస్‌ నేత, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి 

సాక్షి,హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పొలిటికల్‌ పార్టీ కాదు..అది ఒక ప్రొప్రయిటర్‌ కంపెనీఅని సాక్షాత్తు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారని కాంగ్రెస్‌ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ఉద్యోగులకు హక్కులు, వాయిస్‌ ఉంటుందని, కానీ, ప్రొప్రయిటర్‌ కంపెనీలో మాత్రం ఇవేం ఉండవన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్‌ తీరు, పార్టీ విధానాలతో ఎంపీలు జితేందర్‌రెడ్డి, కేశవరావులతోపాటు పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

హామీలు, వాగ్దానాలు నిలబెట్టుకోలేక పోవడంతో ప్రజాప్రతినిధులకు కనీసం ఆత్మగౌరవం లేకుండా పోయిందన్నారు. ఆర్థిక మంత్రి ఈటలకు బడ్జెట్‌ ఎలా ఉంటుం దో అసెంబ్లీలో ప్రవేశపెట్టే వరకు తెలియదని, పోలీసుల బదిలీల ఆర్డర్‌ బయటికి వెళ్లేవరకు హోంమం త్రికి తెలియదని విమర్శించారు. ముందస్తు ఎన్నికలు ఎందుకో టీఆర్‌ఎస్‌ ఎంపీలకే తెలియదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో పనిచేసిన వారికి టీఆర్‌ఎస్‌లో గౌరవం లేదని, కొత్తగా చేరిన వారికి అధిక ప్రాధాన్యతనిచ్చి అందలం ఎక్కించారని ఆరోపించా రు. జై తెలంగాణ అన్న వారు జై కేసీఆర్, జై కేటీఆర్‌ అనాల్సి వస్తోందని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చకు అవకాశమే ఉండదని, నిజాం రాజు కూడా కేసీఆర్‌లాగా నియంతృత్వ పాలన చేయలేదని దుయ్యబట్టారు. కేసీఆర్‌ తీరుతో పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నవ్వులపాలయ్యారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ జాతీయ హోదాపై పార్లమెంట్‌లో పోరాడమని కేసీఆర్‌ సూచించారని, కానీ ఆయన మాత్రం జాతీయ హోదాకోసం కేంద్రానికి దరఖాస్తు చేయలేదన్నారు. కేసీఆర్‌ తీరుతో కేంద్రమంత్రి వద్ద తమ పరువు పోయిందని, ముస్లింల ట్రిపుల్‌ తలాక్‌పై ఒక స్టాండ్‌ లేక ముఖం చాటేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. అప్పులతో, వేల కోట్లు దోచిన డబ్బులనుంచి వెయ్యి రూపాయల పింఛన్‌ ఇస్తే సరిపోతుందా? అని దుయ్యబట్టారు. 

టీఆర్‌ఎస్‌లో సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఉండదు..
టీఆర్‌ఎస్‌లో వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టారని, తన డ్రెస్‌ గురించి కూడా కామెంట్స్‌ చేయడం బాధనిపించిందని కొండా ఆవేదన వ్యక్తం చేశారు. లోక్‌సభలో గైర్హాజరు లేకుండా రోల్‌మోడల్‌గా ఉండేందుకు ప్రయత్నించడాన్ని కూడా అడ్డుకున్నారన్నారు. ఏకంగా పార్లమెంట్‌ సమీపంలోకి కూడా వెళ్ళొద్దని ఆర్డర్‌ వేశారన్నారు. కేటీఆర్, కేసీఆర్‌ మాటలనే పల్లా రాజేశ్వరరెడ్డి, సుమన్‌ చిలకలాగ పలుకుతారని విమర్శించారు. మంత్రి మహేందర్‌రెడ్డి ఫీల్‌ అవుతారని తాండూర్, చేవెళ్లకు వెళ్లొద్దని కేటీఆర్‌ ఒత్తిడి తెచ్చారన్నారు. మహేందర్‌రెడ్డి బ్రదర్స్‌కు భూ కబ్జా బ్రదర్స్‌గా పేరున్నప్పటికి పార్టీలో చేర్చుకుని అందలం ఎక్కించారన్నారు. గుర్రాలను, గాడిదలను కొన్నట్టు కొందరు ఎమ్మెల్యే, ఎంపీలను కొని జీ హుజూరుగా మార్చుకున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఉండదు, అందుకే గుడ్‌ బై చెప్పానని ఆయన వివరించారు. 

>
మరిన్ని వార్తలు