మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై..

10 Sep, 2019 19:50 IST|Sakshi

కేబినెట్‌ బెర్త్‌ దక్కకపోవడంపై అసంతృప్తి లేదు

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దు

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు జూపల్లి, గండ్ర, బాజిరెడ్డి

సాక్షి, నాగర్‌ కర్నూల్‌/నిజామాబాద్‌/భూపాలపల్లి : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ టీఆర్‌ఎస్‌ పార్టీలో కొద్దిపాటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమకు కేబినెట్‌ బెర్త్‌ దక్కకపోవడంపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్‌ మాట తప్పారంటూ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు పార్టీని వీడతారని సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీంతో కొందరు నేతలు మీడియాకు ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

నాగర్‌ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. తాను టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడినని తెలిపారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తుచేశారు. తాను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారతానంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. అలాంటి ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉంది..
తనకు సీఎం కేసీఆర్‌పై పూర్తి విశ్వాసం ఉందని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి రానందకు అసంతృప్తి లేదని చెప్పారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. తాను ఎవరిని నమ్ముతానో వారితోనే చివరి వరకు ఉంటానని తెలిపారు. 

టీఆర్‌ఎస్‌లో పదవుల కోసం చేరలేదు : గండ్ర
మంత్రివర్గ ఏర్పాటుపై తాను అసంతృప్తితో ఉన్నట్టు​ వచ్చిన వార్తల్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ఖండించారు.  కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి పదవుల కోసం రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై పట్ల నమ్మకంతోనే టీఆర్‌ఎస్‌లో చేరానని తెలిపారు.  టీఆర్‌ఎస్‌లో చేరిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి​ చేస్తున్నట్టు చెప్పారు. పదవుల కన్నా పార్టీని బలోపేతం చేయడంపై తన దృష్టి ఉందని పేర్కొన్నారు. సీఎం ఆశీస్సుల వల్లే తన కుటుంబానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి దక్కిందని అన్నారు. తను అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు