టార్గెట్‌ 5

18 Oct, 2018 01:20 IST|Sakshi

కాంగ్రెస్‌ ప్రముఖుల ఓటమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ కసరత్తు 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో కీలకమైన ఐదుగురు నేతలను ఈ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఎలాగైనా వారిని ఓడించాలన్న లక్ష్యంతో కసరత్తు చేస్తోంది. స్వయంగా పార్టీ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఈ నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు తెలిసింది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు డీకే అరుణ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈ జాబితాలో ఉన్నారు. వీరిలో ఉత్తమ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇక జానారెడ్డి (నాగార్జునసాగర్‌), రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), డీకే అరుణ (గద్వాల), కోమటిరెడ్డి (నల్లగొండ) నియోజకవర్గాల్లో గులాబీ అభ్యర్థులు ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. ఈ నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను కేటీఆర్‌ పిలిపించుకుని చర్చలు జరిపి వారు ప్రచారంలో పాల్గొనేటట్లు చేశా రు. కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన నేతలుగా భావిస్తున్న వీరిని వారి నియోజకవర్గం నుంచి బయటకు కాలు మోపనీయకుండా చేయాలన్నదే టీఆర్‌ఎస్‌ లక్ష్యం గా కనిపిస్తోంది. దీనికి తగ్గట్టే సీఎం కేసీఆర్‌ నిత్యం ఈ నియోజకవర్గాల అభ్యర్థులతో మాట్లాడుతూ తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. 

కాంగ్రెస్‌ నాయకులకు వల... 
రేవంత్‌రెడ్డి పోటీ చేసే కొడంగల్‌లో కీలకమైన కాంగ్రెస్‌ నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ఓ సీనియర్‌ నేత వారితో చర్చలు జరుపుతున్నారు. రేవంత్‌కు నియోజకవర్గంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నవారిని గుర్తించే పనిలో టీఆర్‌ఎస్‌ నిమగ్నమైంది. నాగార్జునసాగర్‌లో బలమైన యాదవ సామాజిక వర్గం ఓట్లపై టీఆర్‌ఎస్‌ గురిపెట్టింది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా నోముల నరసింహయ్య పోటీ చేస్తున్నారు. యాదవులతో పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోగలిగితే ఈ సారి నాగార్జునసాగర్‌లో విజయం ఖాయమన్న ధీమాలో టీఆర్‌ఎస్‌ ఉంది.

నరసింహయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గ నేతలను కేటీఆర్‌ పిలిపించుకుని మాట్లాడారు. గద్వాలలోనూ డీకే అరుణ మేనల్లుడు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీసీ వర్గాల్లో మంచి పట్టున్న మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు కుటుంబం కృష్ణమోహన్‌రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేస్తోంది. నల్లగొండలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి..ఓటర్ల సానుభూతిని ఆధారం చేసుకుని గెలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఏ రకంగా ప్రచారం చేయాలి.. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి.. అన్న విషయంలో కేసీఆర్‌ వీరికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పు డు తెలుసుకునేందుకు కేసీఆర్‌ రహస్యంగా పరిశీలకులను నియమించుకున్నారు.  

హుజూర్‌నగర్‌కు గుత్తా లేదా తిప్పన... 
టీపీసీసీ చీఫ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించలేదు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి లేదా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డిలో ఒకరికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. త్వరగా అభ్యర్థిని ప్రకటించడంతో పాటు అక్కడ భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.   

మరిన్ని వార్తలు