ఏకపక్ష విజయమే!

13 Jul, 2019 01:03 IST|Sakshi

అదే లక్ష్యంగా పుర పోరులో అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు

మున్సిపాలిటీలవారీగా ప్రభావం చూపే అంశాలపై సర్వే

సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీల ద్వారా వివరాల సేకరణ

వార్డులను చుట్టి వస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

రాష్ట్ర కార్యవర్గం, ఎంపీ, ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ త్వరలో భేటీ

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తుండటంతో పురపాలక సంఘాల పాలక మండళ్ల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ, ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటుకున్న టీఆర్‌ఎస్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పట్టణాల్లో ఏర్పాటు చేస్తున్న సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో కదలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. మున్సిపల్‌ ఎన్నికల దిశగా ఓవైపు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తూనే మున్సిపాలిటీలవారీగా పార్టీ పరిస్థితి, ప్రభావం చూపే అంశాలపై టీఆర్‌ఎస్‌ నాయకత్వం ప్రత్యేక సర్వేలు చేపడుతోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్‌చార్జీల నుంచి కూడా మున్సిపాలిటీలవారీగా నివేదిక కోరిన పార్టీ అధిష్టానం.. ఆ సమాచారాన్ని క్రోడీకరించి అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసే యోచనలో ఉంది.

పురపాలక సంఘాల పరిధిలో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలపై సర్వే నిర్వహించే బాధ్యతను టీఆర్‌ఎస్‌ ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు సమాచారం. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, అంతర్గత రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు ఎలా ఉన్నాయనే కోణంలోనూ సర్వే సంస్థ వివరాలు సేకరిస్తోంది. అయితే కేవ లం మున్సిపాలిటీ పరిధిలోని అంశాలకే పరిమితం కాకుండా మున్సిపాలిటీ పరిధిలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, నేతల పనితీరు తదితర వివరాలను కూడా సర్వే ద్వారా సేకరించి క్రోడీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో సర్వే సంస్థ సమాచారం సేకరించి క్రోడీకరించే పనిలో ఉంది. సర్వే నివేదిక ఆధారంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, మున్సిపాలిటీలవారీగా ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన అంశాలు తదితరాలను ఖరారు చేయడం సులభమవుతుందని పార్టీ అంచనా వేస్తోంది. ఈ నెల 20లోగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగియనుండటంతో పార్టీ నియమించిన సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలు కూడా మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితి, నేతల పనితీరు తదితరాలను అంచనా వేస్తున్నారు. 

త్వరలో కేటీఆర్‌ ప్రత్యేక సమావేశం... 
సభ్యత్వ నమోదు సందర్భంగా వార్డుల్లో వివిధ వర్గాలతో భేటీ అవుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందనే కోణంలో ఇన్‌చార్జిలు సమాచారం సేకరిస్తున్నారు. విపక్ష కాంగ్రెస్, బీజేపీకి ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న బలాలు, బలహీనతలు, ఎన్నికల్లో ఎంత మేరకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది, పార్టీ నేతల నడుమ సమన్వయం తదివతర అంశాలపైనా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలు అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయ్యాక ఆయా ఇన్‌చార్జిలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది. వార్డులు, మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాల రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం అవుతారు. జూలై మూడో వారంలో జరిగే ఈ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ యంత్రాంగానికి కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికల తరహాలో వార్డు స్థాయిలో పార్టీ అభ్యర్థులు మొదలుకొని మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థుల ఎంపిక వరకు అసంతృప్తికి తావు లేకుండా నేతలు పూర్తి సమన్వయంతో పని చేసేలా కార్యాచరణ రూపొందించడంపై కేటీఆర్‌ కసరత్తు ప్రారంభించారు. 

వార్డులను చుట్టి వస్తున్న ఎమ్మెల్యేలు... 
రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు 130కిపైగా ఉండగా సంగారెడ్డి, సదాశివపేట, మంథని, మధిర వంటి నాలుగైదు మున్సిపాలిటీలు మినహా మిగతా అన్ని మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి. మున్సిపాలిటీలపై పార్టీ పట్టు చేజారకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు ఇప్పటికే ఎన్నికల సన్నాహాలు ప్రారంభించారు. మున్సిపాలిటీల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, ఇతర అంశాలపై ఇప్పటికే వరుస సమీక్షలు చేసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. ప్రస్తుతం వార్డుల్లో పర్యటిస్తూ వివిధ వర్గాలతో భేటీ అవుతున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో తలమునకలవగా మంత్రులు కూడా పట్టణాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వార్డు పర్యటనల్లో భాగంగా ఇతర పార్టీలకు చెందిన క్రియాశీల కార్యకర్తలతోపాటు తటస్థులను పార్టీలో చేర్చుకుంటున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మున్సిపాలిటీలు, వార్డులవారీగా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా జరిగిన ఓటింగ్‌ సరళిని ఎమ్మెల్యేలు విశ్లేషిస్తున్నారు. తాజాగా మున్సిపల్‌ వార్డుల పునర్విభజన ముసాయిదా వెలువడటంతో వార్డులవారీగా అనుకూల, వ్యతిరేకతలపైనా దృష్టి సారించారు. 

ఎమ్మెల్యేల చుట్టూ ఔత్సాహికుల ప్రదక్షిణలు... 
మున్సిపల్‌ వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన వెంటనే కౌన్సిలర్, చైర్మన్‌ స్థానాల రిజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న ఔత్సాహిక నేతలు పార్టీ శాసనసభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యేలకు కీలకం కావడంతో కౌన్సిలర్‌ అభ్యర్థుల ఖరారులో వారే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యేల వార్డుల పర్యటన, సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో ఔత్సాహిక అభ్యర్థులు చురుగ్గా పాల్గొంటూ వారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీల ఏర్పాటుతో బల ప్రదర్శనకు దిగుతున్నారు. వార్డుల రిజర్వేషన్లపై ఎవరికి వారుగా తమకు అనుకూలంగా ఉంటుందనే అంచనాతో వివిధ వర్గాల మద్దతు కూడగట్టుకోవడంపైనా దృష్టి సారించారు. అయితే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను శాస్త్రీయంగా చేపట్టేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో జాబితాను వడపోయాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉంది. 

మరిన్ని వార్తలు