‘దేశం’ కేడర్‌పై గురి

8 Apr, 2019 01:03 IST|Sakshi

టీడీపీలోని ద్వితీయశ్రేణి నేతలను చేర్చుకోవడంపై టీఆర్‌ఎస్‌ దృష్టి

జిల్లా నుంచి గ్రామస్థాయి దాకా ఎక్కువ మందిని ఆకర్షించే వ్యూహం

టీడీపీ ఓటు బ్యాంకు మద్దతు పొందేందుకు మొదలైన కసరత్తు

ఖమ్మం, సికింద్రాబాద్‌ సెగ్మెంట్లలో ఆధిక్యత కోసం ఎత్తులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలను ఆకర్షించిన అధికార టీఆర్‌ఎస్‌... ఇప్పుడు ఆ పార్టీలో మిగిలిన కేడర్‌పైనా దృష్టిపెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లోగా మిగిలిన కొద్ది మంది నియోజకవర్గ స్థాయి నేతలను చేర్చుకునేలా వ్యూహం అమలు చేస్తోంది. ఇలాంటి నేతలతోపాటు అక్కడక్కడా కొన్ని గ్రామాల్లో మిగిలి పోయిన క్యాడర్‌ను అధికార పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎక్కువ మంది టీడీపీ నేతలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో చేరిపోయారు. రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో కొందరు ఇంకా ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే అలాంటి నేతలు ప్రస్తుతం రాజకీయంగా క్రీయాశీలకంగా లేకపోయినా ఆయా ప్రాంతాల్లో వారి ప్రభావం ఉంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మరికొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ ప్రభావం కనిపించింది. అందుకే ఆయా సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌కు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. టీడీపీలో మిగిలిన కొద్ది మంది క్యాడర్‌ కారణంగానే ఇలా జరిగిందని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను, క్యాడర్‌ను చేర్చుకునే వ్యూహాన్ని మొదలుపెట్టింది. రాజకీయంగా ఏ కొంచెం ప్రభావం చూపే వారు ఉన్నా వారిని కచ్చితంగా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేలా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న నేపథ్యంలోనే...
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు... ఇందులో భాగంగా రాష్ట్రంలో 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. దీంతో 16 స్థానాలను కచ్చితంగా కైవసం చేసుకునే వ్యూహంతో టీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. గెలుపునకు అవసరమైన ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా వ్యవహరిస్తోంది. దీంట్లో భాగంగానే తెలంగాణలో ఇంకా టీడీపీలో ఉన్న నేతలు, కేడర్‌పై దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లోగా వీలైనంత ఎక్కువ మందిని అధికార పార్టీలో చేర్చుకునే వ్యూహానికి తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా టీడీపీలో మిగిలిపోయిన నేతలు, కేడర్‌ను గుర్తించి పార్టీలోకి చేర్చుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాతీర్పు టీఆర్‌ఎస్‌ను నిరాశకు గురి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనుకూల పవనాలు ఉన్నా ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒకే స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు టీడీపీకి ఓటు బ్యాంకు ఇంకా మిగిలి ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించింది.

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అనంతరం జిల్లావ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు, కేడర్‌ను చేర్చుకునే ప్రక్రియను మొదటుపెట్టింది. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావును చేర్చుకొని లోక్‌సభ టికెట్‌ ఇచ్చింది. టీడీపీ తెలంగాణ వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించే మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావును సీఎం కేసీఆర్‌ స్వయంగా టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అధికార పార్టీలో చేరిన మండవ... నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం సైతం ప్రారంభించారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్లలో ఇంకా మిగిలిన ఉన్న టీడీపీ నేతలను టీఆర్‌ఎస్‌ చేర్చుకుంటోంది. నిజామాబాద్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ టీడీపీ అధ్యక్షుడు ఎం.ఎన్‌. శ్రీనివాస్‌ సహా ముఖ్య నేతలంతా కేటీఆర్‌ సమక్షంలో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రస్థాయిలో ముఖ్య నేతల చేరికలకు సమాంతరంగా టీడీపీ జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామస్థాయిల్లోని నేతలను, కేడర్‌ను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకునే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మొత్తంగా తెలంగాణలో కొద్ది మాత్రంగా మిగిలిపోయిన టీడీపీని, ఆ పార్టీ ఓట్లను లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఉండేలా టీఆర్‌ఎస్‌ వ్యూహం పూర్తి చేస్తోంది.

నేడు వికారాబాద్‌లో కేసీఆర్‌ సభ...
టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సోమవారం వికారాబాద్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. చేవేళ్ల లోక్‌సభ సెగ్మెంట్‌ ప్రచార సభను టీఆర్‌ఎస్‌ వికారాబాద్‌లో నిర్వహిస్తోంది. రెండు లక్షల మందితో ఈ సభ నిర్వహించేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు వికారాబాద్‌ సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం ఆయన సభ నిర్వహణ ఏర్పాట్లును పరిశీలించారు. వికారాబాద్‌ బహిరంగ సభతోనే కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల ముగియనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ 13 సెగ్మెంట్లలో ప్రచారం పూర్తి చేసినట్లవుతుంది. సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్‌లో ప్రచారం చేయడంలేదు.  

మరిన్ని వార్తలు