కారు X హస్తం

22 Mar, 2019 07:56 IST|Sakshi

చేవెళ్లలో పాగా వేసేందుకు యత్నం  

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగిన కొండా  

దాదాపు 70 వేలకు పైగా మెజారిటీతో విజయం

తొలిసారి బరిలో రంజిత్‌రెడ్డి  

సాక్షి,రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని దక్కించుకునేందుకు నేతలు పక్కా వ్యూహాలతో ముం దుకు వెళ్తున్నారు. పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే జరగనుంది. ఆయా పార్టీల నుంచి ఇద్దరు వ్యాపారులు బరిలోకి దిగుతున్నారు. గులాబీ పార్టీ నుంచి రంజిత్‌రెడ్డి పేరు ఖరారవగా, ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇటీవల జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో నాలుగు స్థానాలు ఉండగా వాటిలో ముగ్గురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. తాండూరు నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పైలెట్‌ రోహిత్‌రెడ్డి గెలిచారు. అయితే, పార్లమెంట్‌ ఎన్నికలు వేరని, ఏ పార్టీకైనా గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దాదాపు 70 వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. అయితే, ఆయనకు పార్టీలో పొసగక ఇటీవల‘కారు’దిగి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. మరోమారు ఆయన బరిలోదిగారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఉమ్మడి జిల్లాలో హేమా హేమీ నేతలు ఉన్నా.. చేవెళ్ల స్థానం నుంచి పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. కొంతకాలం క్రితం మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి  పోటీ చేయనున్నారని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు పోటీ చేసేందుకు సుముఖంగా లేరని తెలు స్తోంది. దీంతో బలమైన అభ్యర్థి కోసం గులాబీ దళపతి దృష్టి సారించి ప్రముఖ పారిశ్రామికవేత్త రంజిత్‌రెడ్డిని బరిలోకి దించారు.   

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే అధికం
గతేడాది డిసెంబర్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించింది. తాండూరు, మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి గెలిచారు. మిగతా ఐదు అసెంబ్లీ స్థానాలైన శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్‌లో గులాబీ అభ్యర్థులే గెలిచారు. ఇటీవల మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరుకుంది.    

కొండా విజయదుందుభి  
చేవెళ్లలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బరిలోకి దిగారు. తెలంగాణఉద్యమ సమయంలో ఆయన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యటించి ఉద్యమాలు చేయడంతో ఆయనకు కలిసొచ్చింది. అప్పట్లో బీజేపీ నుంచి బద్దం బాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కార్తీక్‌రెడ్డి, టీడీపీ నుంచి తూళ్ల వీరేందర్‌గౌడ్‌ బరిలోకి దిగారు. విశ్వేశ్వర్‌రెడ్డి 70,209 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.   

మారిన రాజకీయ సమీకరణలు..
పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. గతంలో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి గెలిచిన కొండా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల సబితాఇంద్రారెడ్డి సైతం కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలో మెజారిటీ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కారెక్కుతున్నట్లు ప్రకటించారు. బలమున్న నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పక్కా స్కెచ్‌ వేస్తూ దూసుకుపోతున్నారు.    

టీఆర్‌ఎస్‌ నుంచి కొత్త ముఖం!
చేవెళ్ల నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ పారిశ్రామికవేత్త డాక్టర్‌ రంజిత్‌రెడ్డిని బరిలోకి దించింది. బిజినెస్‌మన్‌గా గుర్తింపు పొందిన ఈయన విశ్వేశ్వర్‌రెడ్డిని ఢీకొట్టగలరని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. కొన్ని రోజులుగా పట్నం మహేందర్‌రెడ్డి, సబితారెడ్డి, కార్తీక్‌రెడ్డి పోటీ చేస్తారని వినిపించినా ఎట్టకేలకు అనుహ్యంగా రంజిత్‌రెడ్డి పేరు ఖరారైంది.   

బీజేపీ అభ్యర్థి ఎవరో..?  
బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బెక్కరి జనార్దన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈయన కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయకు స్వయాన వియ్యంకుడు. జనార్దన్‌రెడ్డి కొన్ని రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. అయితే, ఇటీవల టీఆర్‌ఎస్‌ నేత జితేందర్‌రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. టికెట్‌ జనార్దన్‌రెడ్డికి ఇస్తేనే తాము పార్టీ కోసం పనిచేస్తామని, లేదంటే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని వికారాబాద్‌ జిల్లాకు చెందిన నేతలు హెచ్చరించారు. పార్టీ అధిష్టానం టికెట్‌ ఎవరికి ఇస్తుందో మరో ఒకటి రెండు రోజులు వేచి చూడాల్సిందే.  

మరిన్ని వార్తలు