‘వారు పోరాడేది కుర్చీల కోసమే’

17 Jun, 2018 19:53 IST|Sakshi

సాక్షి, నకిరేకల్‌/నల్గొండ: కాంగ్రెస్‌ హయాంలో సాగునీటికి, కరెంట్‌కు అరిగోస పడ్డ రైతన్నల కష్టాలు తీర్చడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు హరీశ్‌రావు, జగదీష్‌ రెడ్డి అన్నారు. నీటి వినియోగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని నీతిఆయోగ్‌ ప్రశంసించడం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. నకిరేకల్‌లో ఆదివారం నిమ్మ మార్కెట్‌ను ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

రైతుల ఎన్నో ఏళ్ల కల నిమ్మ మార్కెట్‌ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాకు మూసి ఆయకట్టు కింద 40 వేల ఎకరాలకు ఖరీఫ్‌లో నీటిని విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులపై మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ప్రజల బాగుకోసం ఆలోచించని కాంగ్రెస్‌ నాయకుల మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. వాళ్లు కుర్చీల కోసమే కొట్లాడుకుంటారనీ.. ప్రజా సమస్యలపై పోరాడే తీరిక కాంగ్రెస్‌ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు.

ఏనాడైనా మాట్లాడారా?
టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని హరీశ్‌రావు అన్నారు. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి ఏనాడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఇన్నేళ్ల కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ ఎడమకాలువకు 700 కోట్ల ఖర్చు పెడితే, నాలుగేళ్ళ టీఆర్ఎస్ పాలనలో 1200 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తున్నామని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా అక్రమంగా నీరు ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్తున్నా ఒక్క కాంగ్రెస్ నేత నోరు మెదపలేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు