పల్లెలన్నీ గులాబీలే

5 Jun, 2019 02:33 IST|Sakshi

పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుభి

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ పోరులో గులాబీ గుబాళిం చింది. బ్యాలెట్‌ పేపర్‌ ద్వారా జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్‌ స్థానాలను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఒక్కచోట కూడా కాంగ్రెస్‌ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తం 538 జెడ్పీటీసీ స్థానాలకు గానూ 451 చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొం దగా, కాంగ్రెస్‌ 73 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కారు దూసుకుపోయింది. రాష్ట్రంలో మొత్తం 3,556 ఎంపీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌ పార్టీ 1,396 చోట్ల గెలుపొం దగా.. బీజేపీ 208 చోట్ల, లెఫ్ట్‌ పార్టీలు, టీడీపీ, ఇతరులు కలిపి 649 స్థానాల్లో విజయం సాధించారు.

గెలిచిన ఎంపీటీసీ స్థానాలను బట్టి చూస్తే.. 537 మండల పరిషత్‌లలో 415 ఎంపీపీ పీఠాలను అధికార టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే అవకాశం ఉంది. 60 ఎంపీపీ స్థానాల్లో కాంగ్రెస్‌కు మెజార్టీరాగా.. 4 స్థానాల్లో ఇతరులు గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. 53 చోట్ల ఏ పార్టీకీ ఎంపీపీ పీఠం దక్కించుకునే మెజార్టీ రాలేదు. అయితే, వీటిలో కూడా మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద 60%  ఎంపీటీసీ, 84% జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో తమకు తిరుగులేదని టీఆర్‌ఎస్‌ మరోసారి నిరూపించుకుంది.


టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం...
పరిషత్‌ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యత కనబర్చింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 12 జిల్లాల్లో దాదాపు స్వీప్‌ చేసింది. కరీంనగర్, వరంగల్‌ రూరల్, అర్బన్, జనగామ, గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని అన్ని జెడ్పీటీసీ స్థానాలను గెలుపొందగా, మరో 6 చోట్ల కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఓటమి పాలైంది. మిగిలిన జిల్లాల్లో కూడా కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నామమాత్రపు సీట్లు మాత్రమే సాధించడం గమనార్హం. ఎంపీపీలను కూడా అదే స్థాయిలో టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోనుంది.

కాంగ్రెస్‌ విషయానికి వస్తే కనీసం 10 జిల్లా పరిషత్‌ స్థానాల్లో తాము గట్టిపోటీ ఇస్తామని ఆ పార్టీ నేతలు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. కనీసం ఒక్క చోట కూడా టీఆర్‌ఎస్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో ఆ పార్టీ నిలవలేకపోయింది. రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాలపై ఆ పార్టీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఎంపీటీసీల విషయంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ కేవలం నాలుగో వంతు స్థానాల్లోనే గెలుపొందింది. అభ్యర్థుల ఖరారు, పోలింగ్‌ వ్యూహాలు సరిగా అమలు చేయలేక ఆరు జిల్లాల్లోని జెడ్పీటీసీల్లో ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. 

ఉనికి చాటుకున్న బీజేపీ
లోక్‌సభ ఎన్నికల్లో 4 చోట్ల అనూహ్య విజయం సాధించి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీకి రాష్ట్రంలో సంస్థాగత బలం లేదని మరోమారు రుజువైంది. పరిషత్‌ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 208 ఎంపీటీసీ స్థానాలు, 8 జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. కనీసం ఒక్క ఎంపీపీని కూడా గెల్చుకునే స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. సీపీఎం, టీడీపీ, సీపీఐ, ఇతర పార్టీలు అక్కడక్కడా గెలుపొందాయి. టీఆర్‌ఎస్‌ జోరుకు ఈసారి స్వతంత్రులు కూడా తట్టుకోలేకపోయారు. రాష్ట్రంలో కేవలం 500కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే స్వతంత్రులు విజయం సాధించారు. జెడ్పీటీసీ స్థానాల్లో అయితే కేవలం 5 చోట్ల మాత్రమే గెలుపొందారు. 


 

  

మరిన్ని వార్తలు