టీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాగాలు

8 Sep, 2018 16:22 IST|Sakshi

పార్టీ సిట్టింగ్‌ అభ్యర్థికి వ్యతిరేకంగా కార్యకర్తల సమావేశాలు

సాక్షి, ఖమ్మం : అసెంబ్లీని రద్దు చేసి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు తెరలేపడంతో.. ఆ పార్టీలో అసమ్మతి రాగాలు జోరందుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికల కోసం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ 105 నియోజకరవర్గాల అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలాచోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ మరోసారి అవకాశం కల్పించారు. అయితే, పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై స్థానిక నియోజకవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఖమ్మ జిల్లా వైరా నియోజకవర్గం పార్టీ టికెట్‌ను తాజా మాజీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన మదన్‌లాల్‌కు కేటాయించడంపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన మదన్‌లాల్‌కు మరోసారి అవకాశం ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ మేరకు వైరా నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు శనివారం సమావేశమయ్యారు. మదన్‌లాల్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకించిన కార్యకర్తలు.. పార్టీ నాయకులు, శ్రేణులందరినీ కలుపుకొనిపోయే నాయకుడికి టికెట్‌ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మదన్‌లాల్‌ ఓడిపోతే తమకు సంబంధం లేదని వారు తెగేసి చెప్పారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో  టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బయ్యారం మండల కేంద్రం నుండి  టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు టిఆర్ఎస్‌లో చేరారు.

>
మరిన్ని వార్తలు