అన్ని ‘పంచాయతీ’లను గెలవాలి

16 Dec, 2018 03:00 IST|Sakshi
శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గసమావేశంలోవర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 

ఎక్కువగా ఏకగ్రీవమయ్యేలా చూడాలి 

తెలంగాణభవన్‌లో పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌ 

రేపు కేటీఆర్‌ కొత్త బాధ్యతల స్వీకరణ 

రెండు వారాల్లో జిల్లాల పర్యటనలు 

ప్రత్యేక చాంబర్‌...
 టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కె.తారక రామారావు సోమవారం ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేటీఆర్‌ కోసం తెలంగాణభవన్‌లో ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే ఆరేడు నెలల్లో గ్రామపంచాయతీ, సహకార, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా ఉన్న నేపథ్యంలో తెలంగాణభవన్‌ కేంద్రంగా కేటీఆర్‌ పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండువారాల్లో అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. టీఆర్‌ఎస్‌ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి గురి పెట్టింది. అన్ని గ్రామపంచాయతీలను గెలిచేలా వ్యూహం రచిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, బాధ్యులకు స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షల గ్రాంట్‌ వస్తుందని, వీలైనన్ని పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలని సూచించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన తొలిసారి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తెలంగాణ భవన్‌లో జరిగింది. టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియపై కేటీఆర్‌ ఈ సమావేశంలో ప్రసంగిం చారు. 2006 నుంచి ఇప్పటిదాకా టీఆర్‌ఎస్‌లో తన రాజకీయ అనుభవాలను వివరించారు. డిసెంబర్‌ 26 నుండి జనవరి 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రస్థాయి నేతలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ ప్రక్రియకు పదిరోజుల గడువున్న నేపథ్యంలో అందరూ గట్టిగా పనిచేయాలన్నారు.

పంచాయతీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరిలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు, బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మార్చి నుంచి లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లోక్‌సభస్థానానికి ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్‌చార్జీలుగా నియమిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్‌చార్జీలు గా ఉంటారని తెలిపారు. జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ కార్యాలయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణభవన్‌లో ప్రజల ఫిర్యాదు విభాగం(పబ్లిక్‌ గ్రీవెన్స్‌ సెల్‌)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ విభాగం పనిచేస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠా గోపాల్, సుంకే రవిశంకర్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలను టీఆర్‌ఎస్‌ రాష్ట్ర స్థాయి పదవుల నుంచి ఉపసం హరిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

టీఆర్‌ఎస్‌లో వైరా ఎమ్మెల్యే చేరిక 
వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్య రాములునాయక్‌ శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. అనంతరం రాములునాయక్‌ తన అనుచరులతో కలసి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి రాములునాయక్‌ను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులను ఉద్దేశించి కేటీఆర్‌ మాట్లాడారు. ‘ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో మొదటి చేరిక వైరా నుంచి కావడం ఆనందంగా ఉంది. వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా. తెలంగాణ అంతటా అనుకూల పవనాలు వీచినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు నిరాశ కలిగించాయి. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేస్తాం. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం.

మిషన్‌ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పూర్తయితే టీఆర్‌ఎస్‌ అజేయశక్తిగా మారుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలిచి టీఆర్‌ఎస్‌ సత్తా చాటుదాం. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునేలా కార్యకర్తలు శ్రమించాలి. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనేది టీఆర్‌ఎస్‌ శాసించాలి. మనం చెబితే ఏర్పడే ప్రభుత్వం ఢిల్లీలో కావాలంటే టీఆర్‌ఎస్‌ 16 సీట్లు గెలవాలి. యాచించే స్థితి నుంచి ఢిల్లీలో శాసించే స్థితికి తెలంగాణ ఎదగాలి. బీజేపీకి సంఖ్యాబలం ఉండబట్టే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పెడచెవిన బెట్టింది. కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే బయ్యారం లాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఖమ్మంలో అన్ని నియోజక వర్గాలను అభివృద్ధి చేస్తాం. బంగారు తెలంగాణ దిశగా చిత్తశుద్ధితో పని చేస్తాం’అన్నారు.  


రాములు నాయక్‌ను కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్‌. చిత్రంలో పొంగులేటి 

మరిన్ని వార్తలు