తలసానికి మెజారిటీ తగ్గడం బాధగా ఉంది: కేటీఆర్‌

2 Jan, 2019 15:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 2009లో చావునోట్లో తలపెట్టి మరీ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. టీఆర్‌ఎస్‌ సనత్‌నగర్‌ నియోజకవర్గ కార్యకర్తల స్థాయి సమావేశం జలవిహార్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ ధన్యజీవి అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి, రాహుల్‌ గాంధీ ఇలా ఎంతోమంది నేతలు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినా.. ప్రజలు కేసీఆర్‌కే పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేసే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ఈసారి మెజారిటీ తగ్గడం తనకు బాధ కలిగించిందన్నారు.

‘నిత్యం ప్రజల్లోనే ఉండే తలసానికి భారీ మెజారిటీ వచ్చి ఉండేది. కానీ, రాష్ట్రంలో, హైదరాబాద్‌ నగరంలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయి. మొత్తం 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల సంఘం ఆ తప్పును తిరిగి సవరించుకుంటోంది. ఈవీఎంలను తప్పుబట్టే ప్రతిపక్షాలకు, బుర్ర తుప్పుపట్టిందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ప్రతి గెలుపు నుంచి ఓటమి నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలని, అంతేకానీ, ఓటు వేయని ప్రజలను ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదని ఆయన హితవు పలికారు.

మరిన్ని వార్తలు