యాచిస్తే నిధులు రావు.. ఢిల్లీని శాసించాల్సిందే: కేటీఆర్‌

23 Mar, 2019 18:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థులను నిలిపితే రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ ఓడిపోవడం ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌ ఇన్నేళ్లు దేశానికి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. పేదలకు కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేకపోయిందని, కాంగ్రెస్‌ దారిలోనే బీజేపీ కూడా నడుస్తోందని విమర్శించారు. తాండూర్‌, పరిగి, జహీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్‌ నేతలు శనివారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. జాతీయ పార్టీల ద్వారానే అభివృద్ధి సాధ్యమని కొండావిశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారని,  ఇన్నేళ్లు వారు చేసిన అభివృద్ధి  ఏంటని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తాండూర్‌లో మహేందర్‌రెడ్డి ఓటమి చెందుతారని తామెవ్వరం కూడా అనుకోలేదని పేర్కొన్నారు. ఐఎఎన్‌ఎస్‌ నిర్వహించిన ఓ సర్వేలో దేశంలో కేసీఆర్‌ అత్యుత్తమ సీఎంగా మెదటి ర్యాంకును సాధించినట్లు ఆయన వెల్లడించారు. ఇన్నేళ్లు కాంగ్రెస్‌ నేతలు తెలంగాణకు తెచ్చిన దారిద్య్రం ఐదేళ్లలో ఎలాపోతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు హిమాలయాల్లో ఆకుపసరతాగి వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో 16 స్థానాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుస్తారని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీని గద్దె దించితేనే ప్రజలకు అచ్చేదీన్‌ వస్తుందని అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ఏ జెండా ఎగరవేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఢిల్లీని యాచిస్తే నిధులు రావని..శాసించి నిధులను తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్రంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ రాదని.. 170 సీట్లవరకు బీజేపీ, కాంగ్రెసేయేతర పార్టీలకు వస్తాయని అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే యజ్ఞం సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు