కెనెడా ప్రధాని డిన్నర్‌.. ఉగ్రవాదికి ఆహ్వానం

22 Feb, 2018 10:48 IST|Sakshi
జస్పల్‌ అట్వల్‌కు అందిన ఆహ్వానం ఇదే!

సాక్షి, న్యూఢిల్లీ : కెనెడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పాల్గొనే విందు కోసం ఖలిస్తానీ ఉగ్రవాదికి ఆహ్వానం అందించటం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు అధికారులు ప్రకటించారు.

ట్రూడో కోసం ఢిల్లీలోని కెనడా హైకమిషర్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఓ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ఖలీస్థాన్‌ ఉద్యమకారుడు జస్పల్‌ అట్వల్‌కు కెనడా రాయబార కార్యాలయం ఆహ్వానం పంపింది. మీడియాలో దీనిపై కథనాలు రావటంతో పంజాబ్‌ ప్రభుత్వం నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. కెనడియన్‌ ఎంబసీ స్పందించింది. ఆయన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. 1986లో పంజాబ్‌ మంత్రి మల్కియాత్‌ సింగ్‌ సిద్దూపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో జస్పల్‌ను కోర్టు ఉగ్రవాదిగా తేల్చింది. ఈ కేసులో జస్పల్‌ 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించారు. జస్పల్‌ సభ్యుడిగా ఉన్న ఇంటర్నేషనల్‌ సిక్క్‌ యూత్‌ ఫెడరేషన్‌పై నిషేధం కూడా విధించబడింది.

జైలు నుంచి బయటికొచ్చాక కెనడా రాజకీయాల్లో జస్పల్‌ క్రియాశీలకంగా వ్యవహరించటం ప్రారంభించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం లేవనెత్తాయి.ఇక తాజాగా ట్రూడో హాజరయిన ముంబై ఈవెంట్‌లో సందడి చేసిన జస్పల్‌.. ట్రూడో భార్య సోఫీతో, కెనెడా మంత్రి అమర్‌జీత్‌ సోహితో ఫోటోలు కూడా దిగారు.

మరిన్ని వార్తలు