ట్రంప్‌ కంచు కోటలో అనూహ్య పరిణామం

6 Feb, 2018 10:29 IST|Sakshi
రచెల్‌ క్రూక్స్‌-ట్రంప్‌ (పైల్‌ ఫోటోలు)

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధితుల్లో రచెల్‌ క్రూక్స్‌ ఒకరు. తనను ట్రంప్‌ బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. అలాంటి క్రూక్స్‌ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. ట్రంప్‌ కంచుకోట అయిన ఓహయో నుంచి స్టేట్‌ లెజిస్టేచర్‌ అభ్యర్థిగా ఆమె పోటీ చేయబోతున్నారు. 

‘‘ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అమెరికన్లు కలత చెంది ఉన్నారు. ట్రంప్‌ పాలనలో వారి జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వారి తరపున గొంతుకను వినిపించేందుకే నేను రాజకీయాల్లోకి వస్తున్నా’’ అంటూ ఆమె ఓ ప్రకటన చేశారు. కాగా, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ తన ప్రత్యర్థి హిల్లరీపై 61 శాతం ఓట్లతో ఇక్కడ విజయం సాధించారు. అందుకే ఏరీ కోరి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా రచెల్‌ పేరును ప్రతిపాదించింది.

మరోవైపు 35 ఏళ్ల రచెల్‌ కు కూడా ఈ ప్రాంతంలో మంచి పేరుంది. ప్రస్తుతం హైడెల్‌ బర్గ్‌ యూనివర్సిటీ ఐఎస్‌ఆర్‌ విభాగానికి డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు.  విద్యా వ్యవస్థ కోసం ఆమె చేసిన సంస్కరణలు కూడా మంచి ఫలితానిచ్చాయి. అన్నింటికి మించి ట్రంప్‌ పై ఆమె చేసే విమర్శలు జనాల్లోకి బలంగా నాటుకుపోతున్నాయి. అందుకే క్రూక్స్‌ ను డెమొక్రాటిక్‌ పార్టీ బరిలో దించుతోంది. ఇక రెండు దఫాలు ఇక్కడి నుంచి ఎంపికైన బిల్‌ రైనెకెతో క్రూక్స్‌ ఢీ కొట్టబోతున్నారు. మే 8 తొలి దఫా ఎన్నిక నిర్వహించనున్నారు. మరోవైపు ప్రచారంలో ట్రంప్‌-హిల్లరీ పాల్గొంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రచెల్‌ ఆరోపణలు... 2005లో ట్రంప్ టవర్‌లోని ఒక రియల్ ఎస్టేట్‌ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసేవారు. ఒకరోజు ఉదయం భవనం బయట ఉన్న లిఫ్టులో ట్రంప్ కలిశారు. ట్రంప్‌ తనంతట తాను పరిచయం చేసుకుని ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఆపై బలవంతంగా ఆమె బుగ్గల మీద, తర్వాత పెదాల మీద ముద్దుపెట్టుకున్నాడు. ‘అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది, కానీ, నేను ఏమీ చేయలేనని భావించి ఆయనలా చేసి ఉంటారు’’ అని క్రూక్స​ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. మళ్లీ కొన్నాళ్ల తర్వాత ట్రంప్‌ తన దగ్గరికి వచ్చి తన ఫోన్ నెంబరు అడిగారని.. ఉద్యోగ రీత్యా తాను ఇవ్వాల్సి వచ్చిందని... అయితే తర్వాత ఎలాంటి వేధింపులు ఎదురు కాలేదని ఆమె పేర్కొన్నారు. ఆమెతోపాటు మరో 16 మంది ఒకే సమయంలో ట్రంప్‌ పై ఆరోపణలు చేయటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కథనాలను ట్రంప్‌ వ్యక్తిగత సిబ్బంది ఖండించారు కూడా.

>
మరిన్ని వార్తలు