పార్టీ మూల సూత్రాలు ఇవే..

31 Dec, 2017 12:56 IST|Sakshi

సాక్షి, చెన్నై: సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఊహాగానాలకు తెరదించారు. తాను స్థాపించబోయే పార్టీ ఎలా ఉంటుందో సూచనప్రాయంగా వెల్లడించారు. సత్యం, కార్యం, అభివృద్ధి (ట్రూత్‌, వర్క్‌, గ్రోత్).. తమ పార్టీ మూల సూత్రాలుగా ఉంటాయని అభిమానులతో చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే తాను పాలిటిక్స్‌లోకి వస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాయితీ, జవాబుదారితనం పెంచాల్సిన అవసరముందన్నారు.

మీడియా అంటే భయం
రాజకీయాలంటే తనకు భయం లేదని మీడియా అంటేనే భయపడతానని తలైవా అన్నారు. ఈ విషయంలో తాను మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దీని గురించి చో రామస్వామి గతంలో తనను హెచ్చరించారని, ఆయన లేకపోవడం పూడ్చలేని లోటన్నారు. ఆయన ఉండివుంటే తన కొత్త ప్రయాణంలో అండగా నిలిచేవారని పేర్కొన్నారు.

వివాదాల్లో చిక్కుకోవద్దు
తాను పార్టీ పెట్టే వరకు అభిమానులు ఎటువంటి రాజకీయ విభేదాల్లో చిక్కుకోవద్దని, పార్టీ నిర్మాణంలో పాలుపంచుకోవాలని అభిమానులను రజనీకాంత్‌ కోరారు. సరైన సమయంలో పార్టీని స్థాపిస్తానని, కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగుదామన్నారు. తలైవా ప్రకటనతో ఫ్యాన్స్‌ హర్షాతిరేకాలు తెలిపారు. తర్వాత అభిమానులతో రజనీకాంత్‌ ఫొటోలు దిగారు.

బండారం బయట పెడతా
పార్టీ పేరు, అభ్యర్థులను ప్రకటించాక రజనీకాంత్‌ బండారం బయటపెడతానని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి అన్నారు. కాగా, రాజకీయాల్లోకి రజనీకాంత్‌ రావడం వల్ల ఏ పార్టీకి నష్టంలేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు సౌందరరాజన్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఆయన పోటీ చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Poll
Loading...
మరిన్ని వార్తలు