కాంగ్రెస్‌ సభ్యుల నిరసనకు స‍్పందించిన కేసీఆర్‌

18 Jul, 2019 13:13 IST|Sakshi

రాజ్యాంగబద్ధంగానే సీఎల్పీ విలీనం జరిగిందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. పలు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడంపై కాంగ్రెస్‌ సభ్యులు శాసనసభలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ సభ్యుల నిరసనలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించారు. టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌ ఎల్పీ విలీనం రాజ్యాంగబద్ధంగా జరిగిందని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమైన విషయాన్ని, గోవాలో కాంగ్రెస్‌ సభ్యులు బీజేపీలో విలీనమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారితే తమని నిందించడం సరికాదని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ బలహీనపడిందని ఈ సందర్భంగా కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై విపక్ష సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ, బ్యాలెట్‌ విధానంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు మా పార్టీని దీవించారు. తెలంగాణలో రైతులకు ఉచితంగానే కరెంట్‌ ఇస్తాం. ఎన్నివేల కోట్లు ఖర్చయినా కరెంట్‌ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు