అసత్య ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌!

5 Mar, 2019 12:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విటర్‌లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ డేటా చోరి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసులను టార్గెట్‌ చేస్తూ కొందరు అజ్ఞాత వ్యక్తులు ఫేక్‌ ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా బద్నాం చేసేందుకే పనిగట్టుకొని మరి ఈ పనికి పాల్పడుతున్న ఫేక్‌ ట్విటర్లపై తెలంగాణ ప్రభుత్వం సైబర్‌ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనుంది. (చంద్రబాబు, లోకేశ్‌ మార్గదర్శనంలో.. క్యాష్‌ ఫర్‌ ట్వీట్‌!)

డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లడంతో పాటు, భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు రెండ్రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ అనుమానిస్తోంది. ఇదే అంశాన్ని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సోమవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రస్తావించారు. #CashForTweet అనే హ్యాష్‌ట్యాగ్‌లతో సామాజిక మాధ్యమం ట్వీట్‌ల ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై చంద్రబాబు, లోకేశ్‌ ఆదేశాల మేరకు ఎదురుదాడి జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ ట్వీట్ల వెనుక చంద్రబాబు, లోకేశ్‌ హస్తమున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. (‘చంద్రబాబు పరోక్షంగా నేరాన్ని అంగీకరించారు’)

ఆంధ్ర, తెలంగాణలతో సంబంధంలేని ట్విట్టర్‌ అకౌంట్ల నుంచి వేల సంఖ్యలో డేటా చౌర్యం కేసుకు సంబంధించి ట్వీట్లు వచ్చాయి. అయితే ఈ ట్వీట్ల సారాంశం అంతా.. తెలంగాణ ప్రభుత్వాన్ని ముద్దాయిగా చూపేలా ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌ల నుంచి కూడా తెలుగు పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు చేయడం టీఆర్‌ఎస్‌ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు