దివ్యాంగ ఓటర్లను ఆటోలో తరలిస్తాం

7 Nov, 2018 01:44 IST|Sakshi

సీఈవో రజత్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: పోలింగ్‌ రోజున దివ్యాంగులను వారి ఇళ్ల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు ఆటోల్లో ఉచితంగా తరలిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ ప్రకటించారు. ఇందు కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ ఓటర్లను గుర్తిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఓటర్ల జాబితాలో 4,12,098 మంది దివ్యాంగులుగా నమోదు చేయించుకున్నారని, అయితే వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే సడరం రికార్డుల ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వికలాంగులు 7 లక్షల మందికి పైనే ఉన్నారన్నారు. సడరం రికార్డులతో ఓటర్ల జాబితాలో దివ్యాంగులం దరినీ గుర్తిస్తున్నామని, ఇప్పటికే 50 శాతం ప్రక్రియ పూర్తయిందన్నారు.

మరో 4 రోజుల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా వారిని గుర్తించి రవాణా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఓటరు స్లిప్‌ల పంపిణీకి బూత్‌ లెవల్‌ అధికారులు వెళ్లినప్పు డే దివ్యాంగులు ఏ సమయానికి ఓటేసేందుకు వస్తా రో తెలుసుకుని ఏర్పాట్లు చేస్తారన్నారు. వికలాం గులు వీల్‌చైర్ల ద్వారా సులువుగా వెళ్లేందుకు ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద శాశ్వత ర్యాంపులు నిర్మిస్తున్న ట్లు చెప్పారు. 10 వేల నుంచి 15 వేల వీల్‌ చైర్లను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రెండు పోలింగ్‌ కేంద్రాలకు ఒక వీల్‌ చైర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు.

అంధులు ఓటేయాల్సిన పార్టీ గుర్తును, అభ్యర్థిని గుర్తు పట్టేందుకు వీలుగా బ్రెయిలీ లిపిలో బ్యాలెట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బధిరులకు సంజ్ఞల భాషలో మాట్లాడేలా పోలింగ్‌ అధికారులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. దివ్యాంగుల సదుపాయాల కల్పనకు జిల్లాల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాదా యాప్‌ ద్వారా జీహెచ్‌ఎంసీ పరిధిలో దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

దివ్యాంగ ఓటింగ్‌ను ప్రోత్సహించేందుకు సినీనటి అభినయశ్రీ, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ఆంజనేయ, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ప్లేయర్‌ మహేంద్ర, జాతీయస్థాయి సింగర్‌ శ్రావ్య, టీవీ యాంకర్‌ సుజాత, శాస్త్రవేత్త బాబూనాయక్‌ను బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించామన్నారు. వీరంతా వైకల్యాన్ని అధిగమించి ఆయా రంగాల్లో అద్భుతంగా రాణించారన్నారు.

పరిశీలనలో ఆన్‌లైన్‌ పోలింగ్‌
తీవ్ర వైకల్యమున్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించాలని కోరడం న్యాయబద్ధమైన డిమాం డేనని రజత్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. పోస్టల్‌ బ్యాలెట్‌ దుర్వినియోగం కావడానికి అవకాశముం దనే కారణంతో ఈ మేరకు చట్ట సవరణకు పార్లమెంట్‌ అంగీకరించలేదన్నారు. దీనిపై ఎన్నికల సం ఘం అంతర్గత సదస్సుల్లో చర్చిస్తామన్నారు. ఆన్‌లైన్‌ పోలింగ్‌ నిర్వహించాలన్న ప్రతిపాదనలు సైతం పరిశీలనలో ఉన్నాయన్నారు.

ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రవేశపెట్టిన సీ–విజిల్‌ యాప్‌నకు ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి 1,457 ఫిర్యాదులొచ్చాయన్నారు. అభ్యర్థుల నేర చరిత్రపై వార్తా పత్రికలలో ప్రకటించాలని సుప్రీం కోర్టు ఇచ్చి న ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ నేత హత్యపై రజత్‌ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, ఈ హత్యపై పోలీస్‌ శాఖ నుంచి నివేదిక తెప్పించుకుంటామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రతీ ఘటనకు రాజకీయ రంగు పులమడం సాధారణమేనన్నారు.

మరిన్ని వార్తలు