సత్తా చాటిన మజ్లిస్‌

26 Jan, 2020 04:25 IST|Sakshi

భైంసా, జల్‌పల్లి మున్సిపాలిటీలు కైవసం

సాక్షి, హైదరాబాద్‌: పురపాలక ఎన్నికల్లో మజ్లిస్‌ సత్తా చాటింది. 2 పురపాలక సంఘాలను సొంతంగా కైవసం చేసుకున్న ఆ పార్టీ, అవకాశం వస్తే టీఆర్‌ఎస్‌తో కలిసి నిజామాబాద్‌ కార్పొరేషన్‌పై జెండా ఎగరేసే స్థా యిలో ఉంది. వెరసి పురపాలక సంఘాలకు సంబంధించి 69 వార్డులను, కార్పొరేషన్‌లకు సంబంధించి 17 డివిజన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. గత మున్సిపల్‌ ఎన్నికలతో పోలిస్తే సీట్ల సంఖ్య కొంత తగ్గినా.. అధ్యక్ష స్థానాలను ఎక్కువ కైవసం చేసుకోవటం ద్వారా ప్రస్తుత ఎన్నికల్లో సత్తా చాటుకున్నట్టయింది.

గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించిన ఒకేఒక పురపాలక సంఘం భైంసా. ఈసారి స్పష్టమైన ఆధిక్యంతో దాన్ని నిలబెట్టుకుంది. అక్కడ 26 వార్డులుండగా మజ్లిస్‌ పార్టీ 15 చోట్ల విజయం సాధించి మున్సిపాలిటీ చైర్మన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్తగా ఏర్పడ్డ నగర శివారులోని జల్‌పల్లి మున్సిపాలిటీలో 28 స్థానాలుండగా మజ్లిస్‌ 15 చోట్ల విజయం సాధించి చైర్మన్‌ కుర్చీని సొంతం చేసుకుంది. వీలైతే టీఆర్‌ఎస్‌తో మేయర్‌ పీఠాన్ని  పంచుకునే యోచనలో ఉంది.  అందుకోసం స్వయంగా ఆపార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం

నిజామాబాద్‌లో హవా..
పుర ఎన్నికల్లో నిజామాబాద్‌ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరిన బీజేపీ ఆశలకు గండి కొడుతూ మజ్లిస్‌ పార్టీ 16 డివి జన్లలో గెలిచి మేయర్‌ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు బరిలో నిలిచింది. ఇక్కడ 28 చోట్ల గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మేయర్‌ సీటును పొందాలంటే 31 స్థానాలు అవసరం. ఇక్కడ టీఆర్‌ఎస్‌ 13 స్థానాల్లో విజయం సాధించింది. 2 స్థానాల్లో కాంగ్రెస్, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్, స్వతంత్రులను తమవైపు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్‌–మజ్లిస్‌లు యత్నిస్తున్నాయి. అది సాధ్యమైతే ఈ కూటమి మేయర్‌ స్థానా న్ని సొంతం చేసుకుంటుంది.

పనిచేయని సీఏఏ మంత్రం..
ఈసారి వీలైనన్ని వార్డులు దక్కించుకుని పురపాలికలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరిన మజ్లిస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. గత ఎన్నికల్లో ఒక్క భైంసాను మాత్రమే దక్కించుకుని ఆదిలాబాద్, తాండూరు, నిర్మల్‌లలో వైస్‌చైర్మన్‌ పదవులను చేజిక్కించుకుంది. ఈసారి కనీసం నాలుగైదు చైర్మన్‌ స్థానాలతోపాటు నిజామాబాద్‌ మేయర్‌ గిరీని సొంతం చేసుకోవాలని కలలుగన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అసదుద్దీన్‌ ఒవైసీ ముమ్మర ప్రయత్నమే చేశారు. మున్సిపల్‌ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఆ పార్టీకి కలిసి వచ్చింది.

దీంతో పార్టీకి బలం ఉన్న పట్టణాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేయటం ద్వారా మైనార్టీల ఓట్లను గంపగుత్తగా సాధించాలనుకున్నారు. ఆ వర్గం ఓట్లు చీలకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. కానీ కొంతవరకు ఆశాభంగమే ఎదురైంది. బోధన్‌లో 38 స్థానాలుంటే మజ్లిస్‌ కేవలం 11 చోట్ల విజయం సాధించింది. ఆదిలాబాద్‌లో 5 వార్డులే దక్కాయి. నిర్మల్‌ ఓటర్లు రెండు వార్డులే కట్టబెట్టి కంగు తినిపించారు. తాండూరు, నిజామాబాద్, వికారాబాద్, నారాయణ్‌ఖేడ్‌ ఓటర్లు కూడా నిరుత్సాహపరిచారు.

మరిన్ని వార్తలు