గులాబీ గుబాళింపు

8 Jun, 2019 08:33 IST|Sakshi
కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను గజమాలతో సన్మానిస్తున్న కొత్తపల్లి ఎంపీపీ అధ్యక్షురాలు పిల్లి శ్రీలత

కరీంనగర్‌: జిల్లాలోని 15 మండల పరిషత్‌ అధ్యక్షుల పీఠాలతోపాటు ఉపాధ్యక్షులు, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. శుక్రవారం ఉదయం జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో మొదటగా కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ విజయఢంకా మోగించింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మండలాల్లో జెడ్పీటీసీలను పూర్తిస్థాయిలో గెలుచుకోని సత్తా చాటుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీపీ ఎన్నికల్లోనూ 15 మండలాల్లో విజయం సాధించి మరో రికార్డును సొంతం చేసుకుంది. 11 మండలాల్లో ఎవరి మద్దతు లేకుండా పూర్తిస్థాయిలో అధికారం చేపట్టేందుకు సంఖ్య బలం టీఆర్‌ఎస్‌ పార్టీ సాధించగా.. ఎన్నిక ఏకపక్షంగానే పూర్తయింది.

మిగతా నాలుగు మండలాలైన చిగురుమామిడి, చొప్పదండి, రామడుగు, సైదాపూర్‌లలో స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతుతో మండల పీఠాలను వశం చేసుకుంది. జిల్లాలోని మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు కో ఆప్షన్‌ సభ్యుల స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్ష పార్టీలను కంగుతినిపించింది. ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగకుండా ఎంపీపీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా ముగిసింది. హుజూరాబాద్, కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాల్లోని మండలాలతోపాటు హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో ఉదయం కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు పూర్తి కావడంతో విజయోత్సవ ర్యాలీలతో ఎన్నికల ప్రక్రియ ముగిసింది.

మరిన్ని వార్తలు