దసరా సెలవులు 22 రోజులు ఇస్తారా?

13 Oct, 2019 18:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ కోరారు. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మరణం చాలా బాధాకరమని, అతడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి, మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబట్టే శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు పూర‍్తి బాధ్యత తెలంగాణ ద్రోహులైన మంత్రులదే. సామరస్యంగా సమస్యను పరిష్కారం చేయకుండా రెచ్చగొడుతున్నారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది కుట్ర పన్నుతున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుంది. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు...‘పోరాటాల ద్వారా సాదించుకుందాం. సకల జనుల సమ్మెకు ఆర్టీసీ సమాయత్తం చేయాలి .అందుకు రాజకీయ పార్టీలు కూడా ఏకం కావాలి. శాంతియుతంగా ఆర్టీసి కార్మికులు సమ్మెను కొనసాగించాలి. ఆనాడు సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఏమయితే రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడో ఇప్పుడు కేసీఆర్ కూడా అవే మాట్లాడుతున్నారు. పోలీసు బలగాలను అడ్డు పెట్టుకొని సమ్మెను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. కనీసం సెప్టెంబర్ మాసం జీతాలు కూడా కార్మికులకు ఇవ్వకుండా వారి కడుపు కొట్టారు ముఖ్యమంత్రి. 

దసరా పండగ రోజున 50 వేల మంది కార్మిక సోదరులు పస్తులు ఉన్న పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు అంటే తెలంగాణ బిడ్డలు కాదా?. చర్చలు జరిపేదే లేదు...మాట్లాడేదే లేదు అని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. కేవలం కేసీఆర్ అనుచరులకు కట్టబెట్టేందుకు మాత్రమే ఆర్టీసీని ప్రయివేటు పరం చేస్తామని అంటున్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఏమైనా భర్తీ చేసారా?. ఆర్టీసీ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్‌ను కూడా  దోచుకున్నారు. కేసీఆర్‌ ఉద్యోగుల మధ్య విభజన సృష్టించారు.  

సమ్మెలో విద్యార్థులు భాగస్వాములు అవుతారనే ముఖ్యమంత్రి సెలవులు పొడిగించారు. దసరా సెలవులు 22రోజులు ఇస్తారా?. విద్యార్థులు చదువుకోవాలా? వద్దా?. కేసీఆర్‌ నియంత పాలన కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ ప్రయివేటీకరణ చేయడానికి అభ్యంతరం లేదు. అయితే సంస్థ లాభాలకు మాత్రమే ప్రయివేటీకరణ చేయాలి. ఇక వరంగల్‌లో ఆర్టీసీకి చెందిన మూడున్నర ఎకరాలు ఎవరికి ఇచ్చారు’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు.

మరిన్ని వార్తలు