ఆర్టీసీ సమ్మె : మద్దుతుపై పునరాలోచిస్తామన్న చాడ

9 Oct, 2019 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చే అంశంపై తమ పార్టీ పునరాలోచన చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కారిక్మకుల పట్ల కేసీఆర్‌ వైఖరిని వారు తప్పుబట్టారు. ఈ సందర్బంగా చాడ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటల వింటే నవ్వు వస్తోందని.. గతంలో ఆయన చేసిన వాగ్దానాలు మరోసారి గుర్తుచేసుకోవాలని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను చూసి కేసీఆర్‌ ఎంతో కొంత నేర్చుకోవాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె విరుద్ధమని కేసీఆర్‌ ఎలా అంటారని ప్రశ్నించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో సీపీఐ, టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సమయంలో ఆర్టీసీ సమ్మె ప్రకటన రాలేదని చెప్పారు.

టీఎంయూ స్వతంత్ర సంఘంగా ఉంటే హర్షిస్తామని అన్నారు. ఆర్టీసీ కార్మికుల తొలంగిపు ప్రకటనను కేసీఆర్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హుజూర్‌నగర్‌ మద్దతుపై సీపీఐ పునరాలోచన చేస్తోందని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు ఒంటరిగా లేరని.. తెలంగాణ మొత్తం వారి వెనుక ఉందని అన్నారు. 

కేసీఆర్‌ మాట మీద నిలబడడని మరోసారి రుజువైంది : మందకృష్ణ
ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తొలిరోజు నుంచే తమ మద్ధతు ఉందని అన్నారు. సీఎం కేసీఆర్‌ మాట మీద నిలబడరని మరోసారి రుజువు అయిందని విమర్శించారు. కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉందంటే దానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి కేసీఆర్‌కు కావాల్సిన వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్‌ నియంతృత్వ పోకడకు పోతే గత చరిత్ర మళ్లీ రిపీట్‌ అవుతోందని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు