దీని భావమేమి తిరుమలేశా..

28 Mar, 2019 10:52 IST|Sakshi
సిఫారసు లేఖలు

సాక్షి,  కడప : ఇంతకాలం ఓటుకు నోటు మాత్రమే చూశాం. మైదుకూరు ఓటర్లకు ఇప్పుడు దేవదేవుని దర్శనం కూడా ఉచితంగా లభిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమల వెంకన్న దర్శనం టోకెన్లు విచ్చలవిడిగా జారీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్‌ యాదవ్‌ టీటీడీ చైర్మన్‌ కావడమే అందుకు కారణం. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నా యంత్రాంగం చూస్తుండిపోయింది. ప్రలోభాలను కట్టడి చేయాలనే కనీస స్పృహ లోపించింది. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ టీటీడీ చైర్మనుగా కొనసాగుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు టీటీడీ చైర్మనుగా కొనసాగే సాంప్రదాయం లేదు.

కొనసాగినా దేవదేవుని దర్శనం ఎన్నికల నిమిత్తం వాడుకోరాదు. మైదుకూరులో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. విస్తృత ప్రచారంలో ఉన్న పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఓటర్లకు దర్శనం సౌలభ్యం కల్పిస్తున్నారు. రోజూ మైదుకూరు నుంచి వందల సంఖ్యలో ఓటర్లు దర్శనానికి రలివెళ్తున్నారు. శ్రీవారి బ్రేక్‌ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లతో పాటు పదుల సంఖ్యలో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను జారీ చేస్తూ ఓటర్లను పబ్లిక్‌గా ప్రలోభానికి గురిచేస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఎన్నికల కమిషన్‌ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. గతంలో ఎన్నికలకు నోటిషికేషన్‌ విడుదులైన వెంటనే టీటీడీ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖల స్వీకరణను రద్దు చేసేవారు. గతేడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సిఫార్సు లేఖలను రద్దు చేశారు. ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో అలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో టీటీడీ యంత్రాంగంతీరు వివాదస్పదమైంది. సిఫార్సు లెటర్లు రద్దు చేసినట్లుగా టీటీడీ ప్రకటించినా చైర్మన్‌ కార్యాలయం నుంచి   వెళ్తున్న సిఫార్సులకు శ్రీవారి దర్శనాలు కల్పించడం విశేషం. 

నిబంధనలు భేఖాతర్‌..
ఎన్నికలలో పోటీచేసే టీటీడీ సభ్యుల నామినేషన్‌ తిరస్కరణ గురవుతుందని, తెలంగాణకు చెందిన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్యచేత గతంలో ఆ పదవికి రాజీనామా చేయించారు. చైర్మనుగా సుధాకర్‌యాదవ్‌ రాజీనామా సమర్పించలేదు. ఇది ఎన్నికల నియామావళికి విరుద్దం. మైదుకూరు నియోజకవర్గంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శ్రీవారి దర్శనం ఎరగా చూపుతుండటం విశేషం. వైఎస్సార్‌ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సి హరికిరణ్‌ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా టీటీడీ వీఐపీ లేఖల సిఫార్సు ఆధారంగా దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. దర్శనాలు కేటాయిస్తే టీటీడీ యంత్రాంగం  కోడ్‌ ఉల్లంఘించినట్లేనని తెలిపారు. వాస్తవాలు విచారించాల్సి ఉందని వివరించారు. 

మరిన్ని వార్తలు