విలీనానికి దినకరన్ రాజీ ఫార్ములా!

6 Feb, 2018 16:45 IST|Sakshi
టీటీవీ దినకరన్‌

సాక్షి, చెన్నై: అధికార అన్నాడీఎంకేలో విలీనమయ్యేందుకు సిద్ధమని బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ ప్రకటించారు. తన డిమాండ్లను నెరవేరిస్తే అన్నాడీఎంకే ప్రభుత్వంలో చేరతానని తెలిపారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని స్పష్టం చేశారు. పళనిస్వామి మంత్రివర్గంలో తాను సూచించిన ఆరుగురిని తొలగించాలన్నారు. అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తే అన్నాడీఎంకేలో విలీనం అయ్యేందుకు సిద్ధమని ప్రకటించారు.

దినకరన్‌ డిమాండ్లపై పళనిస్వామి సర్కారు స్పందించాల్సివుంది. ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత దినకరన్‌ దూకుడు పెంచారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతానని శపథం చేశారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే అన్నాడీఎంకేలో విలీనమవుతామని ముందునుంచి ఆయన చెబుతున్నారు. తన వెంటవున్న 18 మంది ఎమ్మెల్యేలపై పళని సర్కారు అనర్హత వేటు వేయడంతో ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఆర్కే నగర్‌ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి దినకరన్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు సమానదూరం పాటిస్తూ ఆయన తన గళం విన్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు