సాయం కరువై మరణశాసమై..

28 Mar, 2019 09:12 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న రైతులు శ్రీనాథ్‌రెడ్డి , దాసరి గోపాల్‌ , రెతు కేశవయ్య , బోయరామప్ప (ఫైల్‌)

 అన్నదాత నుదిట పాలకులు రాసిన మరణశాసనం! 

 సంక్షోభంలో ‘అనంత’ వ్యవసాయం 

 ఐదేళ్లలో 262 మంది రైతుల బలవన్మరణాలు 

 బాధిత కుటుంబాలకు అందని పరిహారం  

ఐదేళ్లుగా కరువు గుప్పిట్లో ‘అనంత’ 
అక్షర క్రమంలో ముందున్న అనంతపురం జిల్లా.. రైతు ఆత్మహత్యల విషయంలో కూడా  మొదటి స్థానంలోనే ఉంటోంది. జిల్లా వార్షిక వర్షపాతం కేవలం 552 మి.మీ. అందులో కీలకమైన ఖరీఫ్‌కు సంబంధించి జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతీ రుతుపవనాల వల్ల కురిసే 338.4 మి.మీ వర్షంపైనే వ్యవసాయం ఆధారపడివుంది. ఏటా ఖరీఫ్‌లో వేరుశనగ, ఇతర పంటలు 20 లక్షల ఎకరాలకు పైగా సాగవుతాయి. ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు 155.5 మి.మీ వర్షంపై రబీ పంటలు ఆధారపడి ఉన్నాయి.

గత కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్, రబీ పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో రూ.2 వేల కోట్ల వరకు పెట్టుబడులు నేలపాలయ్యాయి.  రూ.4 వేల కోట్ల వరకు పంట దిగుబడులు గాలిలో కలిసిపోయాయి. అలాగే రబీలో కూడా రూ.800 కోట్ల పెట్టుబడులు, రూ.1,500 కోట్ల పంట దిగుబడులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఏటా పంటలకు రైతులు రమారమి రూ.2,500 కోట్ల వరకు పెట్టుబడుల పెడుతున్నా వర్షాలు గతితప్పడంతో అందులో సగం కూడా వెనక్కిరావడం లేదు. కనీసం పశుగ్రాసం కూడా దక్కక ప్రధాన ప్రత్యామ్నాయమైన పాడి, పశుసంపద మనుగడ ప్రశ్నార్థకమైంది.  

ఉపాధి పనులే దిక్కు 
యాడికి మండలం చిక్కేపల్లికి చెందిన రైతు జయరామిరెడ్డికి భార్య చంద్రకళ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తమకున్న నాలుగు ఎకరాల పొలంలో వర్షాధారం కింద జొన్న పంటను సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు భారమైంది. యాడికిలోని బ్యాంక్‌లో రూ. 1.50 లక్షల వరకు పంట రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు రుణమాఫీ వర్తించలేదు. మరోసారి పంట పెట్టుబడులకు బ్యాంక్‌ వాళ్లు రుణం మంజూరు చేయలేదు. దీంతో పంటల సాగుకు పెట్టుబడులతో పాటు 2017 అక్టోబర్‌ 24న పెద్దకూతురుకు పెళ్లికి ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ. 3 లక్షల వరకు అప్పులు చేయాల్సి వచ్చింది.

అప్పటికే అప్పుల వారి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఉండేవి. అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో కుమార్తె పెళ్లి చేసిన మరుసటి రోజు అంటే అదే నెల 26న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయమూ అందలేదు. బ్యాంక్‌లో ఉన్న అప్పు మొత్తం వడ్డీతో సహా కడితే తప్ప పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వం అంటూ బ్యాంక్‌ అధికారులు తేల్చిచెప్పడంతో చంద్రకళకు దిక్కుతోచడం లేదు. పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. చివరకు కుటుంబ పోషణ కోసం ఉపాధి పనులకు వెళుతూ.. చిన్న కుమార్తెను నిట్టూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటోంది.   

 
ఉపాధి పనులతో పొట్టపోసుకుంటున్న చంద్రకళ     

ఆత్మహత్యల గుర్తింపులో అన్యాయం 
ఈ ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా ఏకంగా 262 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 421 జీఓ ప్రకారం అప్పులబాధ తాళలేక కుటుంబంలో జరిగిన ఎలాంటి ఆత్మహత్యనైనా రైతు ఆత్మహత్యగా గుర్తించాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఆత్మహత్యల గుర్తింపు, పరిహారం మంజూరులో అడుగడుగునా దగా చేస్తూ వచ్చింది. 262 మంది ఆత్మహత్యలకు గానూ ప్రభుత్వం గుర్తించింది కేవలం 38 మాత్రమే.  ‘అనంత’లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలు గుర్తించాలని, పరిహారం అందించాలని అసెంబ్లీలో విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు. అయితే ఇందులో రూ. 1.50 లక్షల వరకూ బాధిత రైతు కుటుంబానికి ఏ మేరకు అప్పలు ఉన్నాయో అంత చెల్లిస్తున్నారు. తక్కిన రూ. 3.50 లక్షలను ఏడాదికి రూ.50 వేల చొప్పున పంటసాగు కోసం ఇస్తామని ప్రకటించారు. ఇలా పరిహారం మంజూరులో కూడా అడ్డగోలు షరతులు పెట్టడంతో బాధిత రైతు కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి.   

ఆదుకోని రుణమాఫీ, బీమా, రాయితీలు 
ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసిన రైతు రుణమాఫీ అస్తవ్యస్తంగా ఉండటంతో రైతులు కోలుకోలేకపోయారు. ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. హామీ ఇచ్చిన సమయానికి జిల్లా వ్యాప్తంగా రూ.6,817 కోట్ల రుణాలు ఉండగా అందులో చంద్రబాబు సర్కారు రూ.2,744 కోట్ల మాఫీకి పచ్చజెండా ఊపింది. అందులోనూ నాలుగు, ఐదు విడతల కింద రూ.1,132 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. రుణమాఫీ అర్జీలు ఇవ్వడానికే నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్న రైతులు వేలల్లో ఉన్నారు. ఇటీవల అమలు చేసిన సుఖీభవ కింద ఇచ్చిన రూ.వెయ్యి చిల్లర ఖర్చులకు కూడా సరిపోలేదు. ఆదుకుంటుందనుకున్న వాతావరణ బీమా, ఫసల్‌బీమా లాంటి పథకాలు ధీమా ఇవ్వలేకపోయాయి. వాటి కోసం కట్టిన ప్రీమియం మొత్తం కూడా వెనక్కిరాలేదు. 2014లో రైతులకు దక్కాల్సిన రూ.643 కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ చంద్రబాబు సర్కారు ఇవ్వకుండా మోసం చేసింది.

2016లో కూడా రాష్ట్రంలో ఏడు జిల్లాలకు ఇన్‌పుట్‌ ఇచ్చినా... పంట దెబ్బతిన్న ‘అనంత’ రైతులకు మాత్రం మొండిచేయి చూపించింది. ఈ ఏడాది రూ.937 కోట్లతో పంపిన ఇన్‌పుట్‌ నివేదికకు ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు. కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టడం లేదు. ఏటా కేంద్ర ప్రభుత్వానికి చెందిన కరువు బృందాలు జిల్లాకు వచ్చి వెళుతున్నా కరువు నిర్మూలన చర్యలకు ఉపక్రమించడం లేదు. ఇక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుసంవర్ధకశాఖ అమలు చేస్తున్న పథకాలు రైతులకు ఏమూలకు చాలడం లేదు. రైతులకు ఉపయోగపడే పథకాలు లేవు. వాటికి పెద్దగా రాయితీ వర్తింపు కూడా లేకపోవడంతో రైతులకు వ్యవసాయం భారమైపోయింది. ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో చేసేదేమీ లేక అన్నదాత ఇంట మరణమృదంగం మోగుతోంది.   

ఈ ఐదేళ్లలో జిల్లాలో చోటు చేసుకున్న రైతు ఆత్మహత్యలు:   

ఏడాది ఆత్మహత్యలు
214 41మంది
2015 90మంది
2016 38మంది
2017 38మంది
2018 46మంది
2019 09మంది

గత ఐదేళ్లలో ఖరీఫ్‌ పంటల సాగు, అందులో వేరుశనగ దిగుబడులు, జరిగిన పంటనష్టం... 

ఏడాది    అన్ని పంటలు హెక్టార్లలో..    వేరుశనగహెక్టార్లలో.. వేరుశనగ దిగుబడి   హెక్టార్లలో.. పంటనష్టం అంచనా... 
2014  7,38,555   5,50,794  236 కిలోలు రూ. 2,800 కోట్లు 
2015    6,46,172  4,44,122  670 కిలోలు    రూ. 2,300 కోట్లు  
2016   7,67,143   6,09,377  215 కిలోలు    రూ. 3,400 కోట్లు 
2017    6,10,473    4,01,350   850 కిలోలు   రూ. 2,900 కోట్లు    
2018    6.67,897    4,64,599   178 కిలోలు   రూ. 3,800 కోట్లు  

గత ఐదేళలో వర్షపాతం, భూగర్భజల మట్టం వివరాలు... 

సంవత్సరం కురిసిన వర్షం భూగర్భ జల(మట్టం)
2014-15 404.3 17.11
2015-16 607.7 18.15
2016-17 333.0 22.10
2017-18 646.4 23.50
2018-19 274.2 24.90

జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం552.3మి.మీ. 

మేమేం పాపం చేశాం?  
  
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారుల పేర్లు మహిత, హరిత. రామినేపల్లికి చెందిన రైతు యలమారెడ్డి గారి శ్రీనాథ్‌రెడ్డి (33) కుమార్తెలు. శ్రీనాథ్‌రెడ్డి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంతో వారిద్దరూ తండ్రి లేని వారయ్యారు. వివరాల్లోకెళితే..శ్రీనాథ్‌రెడ్డికి  గ్రామ సమీపంలో 4 ఎకరాల పొలం ఉంది. పొలంలో రెండు బోవులు తవ్వించినా చుక్క నీరు పడలేదు. పంటల సాగు, బోర్ల తవ్వకం కోసం అప్పు చేశాడు. అలాగే రాప్తాడు కెనరాబ్యాంకులో రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అసలు వడ్డీ కలిపి రూ.2.85 లక్షలు అయింది. బయట వ్యక్తుల వద్ద రూ.7.20 లక్షల దాకా అప్పు ఉంది. అయితే వరుస కరువుల నేప థ్యంలో పంట చేతికి రాలేదు.

దీంతో అప్పుల భారం పెరిగిపోయి వాటిని తీర్చే మార్గం కానరాక 2017  ఏప్రిల్‌ 19న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రుణదాతలతో పాటు బ్యాంకర్లు, పూచీకత్తు ఉన్న రైతుల ఒత్తిడితో దిక్కుతోచని రైతు శ్రీనాథ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం నుంచి కూడా ఈ రైతు కుటుంబానికి ఎటువంటి పరిహారం రాకపోవడంతో చేసిన అప్పులు అలాగే మిగిలిపోయాయి. రుణం చెల్లించాలంటూ  2017, సెప్టెంబర్‌ 18న, 2018 సెప్టెంబర్‌ 26న బ్యాంకు అధికారులు రైతు భార్య లక్ష్మీకి నోటీసులు కూడా ఇచ్చారు. ఇక రుణదాతలు కూడా ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు.   

అప్పులే మా కొడుకును బలిగొన్నాయి 
మాకున్న ఎనిమిది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాం. ఏడెమిదేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవ లేదు. ప్రతి ఏటా పంటలు పండక తీవ్రంగా నష్టపోయాం. రుణమాఫీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా ప్రభుత్వమూ మోసం చేసింది. పంట పెట్టుబడులకు చేసిన రూ. 6 లక్షల అప్పులు తీర్చే మార్గం కానరాక ఈ ఏడాది జనవరి 31న పొలంలోని చెట్టుకు మా కుమారుడు అశోక్‌రెడ్డి ఉరివేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు.
  
శెట్టిపల్లి సుబ్బరత్నమ్మ, శివారెడ్డి, దంపతులు, పూలఓబయ్యపల్లి, తాడిమర్రి  కుమారుడు ఆశోక్‌రెడ్డి ఫొటో చూపుతున్న తల్లిదండ్రులు    


ఒక పూట పస్తులతో.. 
ఈమె పేరు బయమ్మ. యల్లనూరు మండలం దంతలపల్లి గ్రామం. ఈమె భర్త దాసరి గోపాల్‌. తమకున్న మూడు ఎకరాల్లో పంట సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరికి విశ్వనాథ్‌ అనే బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న 21 సంవత్సరాల వయసున్న కుమారుడు ఉన్నాడు. ఇతరుల సాయం లేనిదే ఏ పనీ చేసుకోలేడు. పంట సాగు కోసం వేసిన బోరుబావి ఎండిపోవడంతో.. 2014లో మూడు లక్షలు వెచ్చించి మూడు బోరుబావులు తవ్వించారు. అయినా ఫలితం లేకపోయింది.

పంట సాగుకు రూ. 1.50 లక్షల అప్పులు చేశారు. అరకొర సాగునీటితో పంట చేతికి రాలేదు. దీంతో 2015లో రూ.3.50 లక్షలు అప్పు చేసి 80 గొర్రెలను కొనుగోలు చేసి జీవనాధారాన్ని మార్చుకున్నారు.  మూడు నెలల వ్యవధిలోనే ఇందులో 40 గొర్రెలు చనిపోయాయి. ఇదే సమయంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు తీవ్రం కావడంతో ఉన్న 40 గొర్రెలు అమ్మి రూ. 3 లక్షలు అప్పులు తీర్చాడు. మిగిలిన రూ. 5 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక గత ఏడాది జూన్‌ 2న గోపాల్‌ విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ప్రస్తుతం ఈ కుటుంబం చాలా దయనీయ పరిస్థితుల్లో బతుకుతోంది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న కుమారుడిని వదిలి తల్లి ఎక్కడకు వెళ్లలేకపోతోంది. కుమారుడికి అందే రూ. వెయ్యి వికలాంగ పింఛన్‌తో సర్దుకుపోతూ ప్రతి నెలా అందే రేషన్‌తో ఒక పూట భోజనం చేస్తూ.. మరోపూట పస్తులతో ఆ తల్లి గడుపుతోంది.    
   
కుమారుడి పరిస్థితిని చూపెడుతున్న బయమ్మ


చితికిన బతుకులు 

పాడి ఆవుతో జీవనం సాగిస్తున్న లావణ్య, పిల్లలు,  

ఈ చిత్రంలో పాడిఆవుకు మేత పెడుతున్న ఈమె పేరు లావణ్య. ఆ పక్కన ఉన్నది ఆమె పిల్లలు. తన భర్త బాలకేశవయ్య జీవించి ఉన్నప్పుడు తమకున్న 4.90 ఎకరాల్లో పంటల సాగు చేస్తూ జీవనం సాగించేవారు. ఐదేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పంటలు సరిగా పండలేదు. పంటల సాగుకు గూనిపల్లి సహకార సంఘంలో దీర్ఘకాలిక రుణం కింద రూ. 3 లక్షలు, స్వల్ప కాలిక రుణం కింద మరో రూ. 50 వేలు తీసుకున్నాడు. బ్యాంకుల్లో రుణాలు పుట్టకపోవడంతో పంట పెట్టుబడులకు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ. 2 లక్షల వరకూ అప్పులు చేశాడు. చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ వర్తించలేదు. అదే సమయంలో అప్పులు తీర్చే మార్గం కానరాక 2016లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న లావణ్య పరిస్థితి తెలుసుకున్న నటుడు మోహన్‌బాబు కుమార్తె మంచు లక్ష్మి.. కొంత మేర ఆర్థిక సాయంతో పాటు ఓ గ్రైండర్‌ అందజేశారు. ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా లక్ష్మి అందజేసిన ఆర్థిక సాయంతో పాడి ఆవును కొనుగోలు చేసి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.  

ఏ పూటకాపూట కూలి పనులతో..  

బియ్యంలో రాళ్లు ఏరుతున్న ఈమె పేరు బోయ మారెక్క. గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. తన భర్త బోయ రామప్ప జీవించి ఉన్నప్పుడు తమకున్న ఐదు ఎకరాల్లో  పంటల సాగుకు బోర్లు వేయించడం.. విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్‌ ఇతర ఖర్చుల కోసం ప్రైవేటు వ్యక్తులతో రూ. 4.50 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆశించిన మేర పంట దిగుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చడం భారమైంది. చివరకు మనోవేదనతో కుమిలిపోతూ 2018 సెప్టెంబర్‌ 21న రామప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. ఆయన మృతితో కుటుంబం జీవనం దుర్భరమైంది.  ఉన్న ఐదు ఎకరాల పొలం కూడా బీడుపడింది. ఏ పూటకాపూట కూలి పనులతో పొట్ట పోసుకుంటున్నారు. ఇంటిలో సామగ్రి ఏదీ లేదు. మంత్రి కాలవ శ్రీనివాసులను కలిసి తమ దీన పరిస్థితి వివరించి, సాయం చేయాలని అర్థించినా.. ఫలితం లేకుండా పోయిందంటూ మారెక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   – గుమ్మఘట్ట 

మరిన్ని వార్తలు