జేడీఎస్‌కు షాక్‌.. పోటీ విరమణ!

21 Nov, 2019 08:28 IST|Sakshi

ఇద్దరు అభ్యర్థులు పోటీ విరమణ!  

చిక్కబళ్లాపురలో నామినేషన్‌ తిరస్కృతి

బెంగళూరు: ఉప ఎన్నికల సమరంలో ప్రతిపక్ష జేడీఎస్‌కు ఊహించని ఫలితాలు ఎదురవుతున్నాయి. హిరేకరూరు, అథణి అభ్యర్థులు పోటీ చేయరాదని నిర్ణయించారు. మరో నియోజకవర్గంలో అభ్యర్థి నామినేషన్‌ చెల్లలేదు. మండ్య కేఆర్‌పేటెలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారానికి ముఖం చాటేయడం గమనార్హం. 15కు గాను 14 స్థానాల్లో పోటీలోనున్న జేడీఎస్‌కు తాజా పరిణామాలు శరాఘాతమే. త్వరలో ఈ సంఖ్య  పెరిగినా పెరగవచ్చని నాయకుల మాట. రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కాగా జేడీయస్‌కు పలువురు అభ్యర్థులు అనూహ్యంగా షాక్‌ ఇస్తున్నారు. హిరేకరూరు నియోజకవర్గం నుంచి జేడీయస్‌ అభ్యర్థి శివలింగ శివాచార్యస్వామీజీ నామినేషన్‌ వెనక్కి తీసుకోనున్నారు. అదేవిధంగా అథణి నియోజకవర్గం జేడీయస్‌ అభ్యర్థి, డిప్యూటీ సీఎం లక్ష్మణసవది ఆప్తుడు గురుదాస్కళ నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. చిక్కబళ్లాపురం అభ్యర్థి కేపీ.బచ్చేగౌడ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు సక్రమంగా లేదని తిరస్కరించారు. అతనికి బదులు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అనితా కుమారస్వామి బంధువును ప్రకటించాలని జేడీయస్‌ భావిస్తోంది.

కేఆర్‌ పేటెలో కినుక
మండ్య జిల్లాలోని కేఆర్‌.పేటే నియోజకవర్గంలో దేవరాజుకు జేడీఎస్‌ టికెట్‌ కేటాయించడం ఎమ్మెల్యేలు పుట్టరాజు, డీసీ. తమ్మణ్ణ, అన్నదానికి నచ్చడం లేదు. దీంతో వారు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేఆర్‌.పేటే ఉప ఎన్నికలో జేడీయస్‌ నుంచి జిల్లా పంచాయతీ సభ్యుడు హెచ్‌డీ.రాజు కు టికెట్‌ ఇవ్వాలని పుట్టరాజుతో పాటు పలువురు జేడీయస్‌ నేతలు దళపతులపై ఒత్తిడి తీసుకువచ్చినా పట్టించుకోలేదు.

 హ్యాండిచ్చిన స్వామీజీ
హిరేకరూరు నియోజకవర్గం నుంచి జేడీయస్‌ అభ్యర్థి శివలింగాచార్యస్వామిజీ సీనియర్‌ మఠాధీశుల ఒత్తిడి వల్ల పోటీ నుంచి వైదొలిగారు. మాజీ సీఎం కుమారస్వామి ఆదివారం అర్ధరాత్రి శివలింగాచార్య స్వామిజీతో మాట్లాడిన తరువాత రాత్రికి రాత్రి బీ.ఫారం తీసుకుని నామినేషన్‌ వేశారు. కానీ మంగళవారం పంచపీఠాధీశ్వర  ఇతర స్వామీజీల ఒత్తిడితో గురువారం నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.

జేడీఎస్‌ నేతల బహిష్కరణ
యశవంతపుర: బెంగళూరు మహలక్ష్మీ లేఔట్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గోపాలయ్యకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని బీబీఎంపీ జేడీఎస్‌ కార్పొరేటర్‌ హేమలతా గోపాల య్య తో పాటు ఇద్దరు జేడీఎస్‌ నాయకులను పార్టీ నుండి బహష్కరించారు. మహదేవ్, జయరామ్‌ అనేవారిని పార్టీనుంచి బహష్కరించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా