సీఎల్పీ భేటీకి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా..

3 Mar, 2019 13:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీఎల్పీ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి 15మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరు కాగా, ఉపేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ భేటీకి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, సీతక్క, గండ్ర వెంకట రమణారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, జగ్గారెడ్డి, హర్షవర్ధన్‌ రెడ్డి, సురేందర్‌, పొడెం వీరయ్య, హరిప్రియ నాయక్‌, సుధీర్‌ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు హాజరు అయ్యారు. చదవండి...(కాంగ్రెస్‌కు ఝలక్‌.. టీఆర్‌ఎస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు)

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), రేగా కాంతారావు (పినపాక) టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటన కూడా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో వీరిద్దరూ ఆదివారం గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు రేగా, ఆత్రం బాటలోనే మరికొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాల వ్యాఖ్యల నేపథ్యంలో ఉపేందర్‌ రెడ్డి, పైలెట్‌ రోహిత్‌ రెడ్డి సీఎల్పీ సమావేశానికి రాకపోవడంపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఉపేందర్‌ రెడ్డి అనుమతి తీసుకున్నట్లు చెబుతున్నా... ఇక రోహిత్‌ రెడ్డి గైర్హాజరుపై సమాచారం లేదు.

కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకునే దిశగా టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచిన విషయం విదితమే. విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపింది. ఐదు ఎమ్మెల్సీ సీట్లు, 16 లోక్‌సభ స్థానాలు దక్కించుకునే ద్విముఖ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇద్దరు, తెలంగాణ టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ’కారు’  ఎక్కుతున్నారు. దీంతో.. కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోని వలసలు భారీగానే ఉన్నాయనే చర్చ మొదలైంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి కాంగ్రెస్‌ శాసనసభపక్షం మొత్తం టీఆర్‌ఎస్‌లో విలీనమైనా ఆశ్చర్యపోవద్దని అధికార పార్టీ ముఖ్యనేతలు అంటున్నారు. 
 

మరిన్ని వార్తలు